జనగామ రూరల్, మే 16 : ‘సార్ వారం రోజుల నుంచి ధాన్యం కొంటలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన వడ్లు ఎండకు ఎండుతున్నయి.. వానకు తడుస్తూ మొలకొస్తున్నయ్.. బాంచెన్ కాల్మొక్తా.. జర వడ్లు కొనండి సార్’ అని రైతులు పోలీసు అధికారి కాళ్లపై పడి వేడుకున్నారు. వారం రోజులైనా కాంటా పెట్టకపోవడంతో శనివారం జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని వడ్లకొండలో జనగామ-హుస్నాబాద్ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
‘ధాన్యం కొనుగోలు చేసింది లేదు. లారీ వచ్చింది లేదు. ఎండకు ఎండాలే. వానకు తడువాలే తప్ప.. గింజ కొంట లేరు’ అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడైనా కొనుగోలు చేస్తే లారీలు రాక వర్షానికి తడిసి వడ్లు మొలకెత్తుతున్నాయని మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూపుతూ నిరసన తెలిపారు. సీఐ సత్యనారాయణరెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పలువురు రైతు లు.. సీఐ కాళ్లపై పడి.. ‘బాంచెన్ కాల్మొక్తా.. వడ్లు కొనుగోలు చేయుండ్రి. కొనుగోలు చేసిన ధాన్యం తరలించడానికి లారీలను పంపుండ్రి సార్’ అని వేడుకున్నారు. అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుతోపాటు లారీలు పంపేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.