కమాన్‌బజార్, మే 16 : ఖమ్మం నగరంలోని లకారం సర్కిల్లోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. విగ్రహ ప్రాంగణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏండ్ల ప్రస్థానంపై ఆయన అభిమానులు పైలాన్ నిర్మించడంపై ‘పీవీ ప్రాంగణంలో ఇతర విగ్రహాలొద్దు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మెయిన్‌లో శనివారం వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన నగర పాలక సంస్థ అధికారులు వీపీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో తుమ్మల 40 ఏండ్ల ప్రస్థానంపై నిర్మిస్తున్న పైలాన్ పనులను నిలిపివేశారు. కట్టడాలను పూర్తిగా తొలగించారు. ఈ పైలాన్‌ను మున్సిపల్ అధికారులు తొలగించడంతో బ్రాహ్మణ సంఘం ఆధ్వరంలో పీవీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, నివాళులర్పించారు. తమ మనోభావాలను గుర్తిం చి, నిర్మాణాలను తొలగించడంపై ఆ సం ఘం నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పైలాన్‌ను వెంటనే తొలగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పైలాన్ నిర్మాణంపై ప్ర జలు, ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో స్పందించిన మంత్రి వెం టనే నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యను ఆదేశించి, పైలాన్ పనులు నిలిపివేసి అక్కడి శకలాలను తీసివేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ మహోన్నత వ్యక్తి అని, ఆయనను కించపరిచే విధంగా చర్యలు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యకర్తలు ప్రచార ఆర్భాటాలకంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.