వనపర్తి : పంట పండించడానికి పడ్డ కష్టం కంటే , అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శివాజీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) రైతులతో కలిసి నిరసన ( Protest ) చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులను పట్టించుకునే వారే లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. గన్ని బ్యాగులు,లారీలు, మిల్లుల కేటాయింపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో అకాల వర్షాలతో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జాప్యంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు నష్టానికి అమ్ముకుంటున్నారని తెలిపారు. పండించిన ప్రతి గింజను కొనే వరకు రైతుల పక్షాన ఉండి పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.