నల్లగొండ ప్రతినిధి/చండూరు/ ఆత్మకూరు, సెప్టెంబర్ 8: ఎల్ నినో ప్రభావంతో కండ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేని రైతులు చేనుల్లోనే తనువు చాలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటకు చెందిన రైతు పనస రాములుగౌడ్(55)కు రెండెకరాల భూమి ఉండగా మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2 లక్షల పెట్టుబడితో పత్తి పంట సాగుచేశాడు. ప్రారంభంలో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు విత్తగా.. చేను ఓ మాదిరిగా పెరిగింది.
కాత దశకు వచ్చేసరికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో పదెకరాల పత్తి చేను వాడిపోవడం మొదలుపెట్టింది. సోమవారం సాయంత్రం పత్తి చేనులోకి వెళ్లిన రాములుగౌడ్ కండ్లముందే పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక, అప్పు తీర్చే మార్గంలేక అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాములుగౌడ్ భార్య జంగమ్మ ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చండూరు ఎస్సై శివకుమార్ తెలిపారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన వెన్నపురెడ్డి లక్ష్మారెడ్డి(55) తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమితోపాటు మరో మూడు ఎకరాలు తీసుకుని పంటలు సాగుచేశాడు. పంటల పెట్టుబడికి రూ.6 లక్షల వరకు అప్పుచేశాడు. వర్షాభావంతోపాటు పంటల దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులెలా తీర్చాలని ఆవేదన చెంది మంగళవారం తన పంట పొలాల్లో పురుగులమందు తాగాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.