నరేంద్రమోదీ నేతృత్వంలో 12 ఏండ్ల క్రితం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రైవేటీకరణ అడ్డూఅదుపు అనేది లేకుండా సాగిపోతున్నది. అనేక ప్రభుత్వరంగ కంపెనీలను ఒక్కొక్కటిగా అస్మదీయులైన కార్పొరేట్లకు కట్టబెడుతుండటం తెలిసిందే. ముఖ్యంగా రేవులు, విమానాశ్రయాల ప్రైవేటీకరణ ఈ ధోరణికి అద్దం పడుతున్నది. తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేట్ బాట పట్టిస్తున్నారనే వివాదం ముసురుకుంటున్నది. ప్రభుత్వం ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని అంటున్నప్పటికీ, జరుగుతున్న పరిణామాలు మరోరకం సంకేతాలు వెలువరిస్తున్నాయి. రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, లాంచ్ సేవలు వంటి కీలక రంగాలను క్రమంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే యత్నాలు జరుగుతున్న మాట వాస్తవం. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అంతరిక్ష రంగంలో కార్పొరేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
జరుగుతున్న పరిమాణాలపై ఇస్రో సిబ్బందిలో అసమ్మతి రాజుకుంటున్నది. తమ ప్రాముఖ్యం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్త లు ప్రైవేట్ రంగానికి వెళ్లిపోతున్నారనే వార్తలు కూడా జోరుగా వినవస్తున్నాయి. అందుకు ఉద్యోగులు ఎంచుకుంటున్న స్వచ్ఛంద ఉద్యోగ విరమణపై సంస్థ ఆంక్షలు విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం తప్పు కాదు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతున్నది. కానీ అక్కడ ప్రభుత్వ సంస్థలు తమ కేంద్రీయ పాత్రను కోల్పోవడం లేదు. ఉదాహరణకు, అమెరికాలో నాసా ప్రైవేట్ కంపెనీలతో పనిచేస్తున్నప్పటికీ, దిశానిర్దేశం, నియంత్రణ, పరిశోధనలో కీలక స్థానాన్ని నిలుపుకొంటున్నది. కానీ భారతదేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారుతున్నదనే వాదన వినిపిస్తున్నది. ఇస్రోను బలహీనపరుస్తూ, కార్పొరేట్ సంస్థలను ముందుకు తెస్తున్నారనే విమర్శలు జోరందుకుంటున్నాయి. ఇస్రోలో ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా అల్టిమేటమ్ ఇచ్చాయి. ఇస్రో స్వరూప, స్వభావాలను దెబ్బతీసే విధంగా కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తే తాము మౌనంగా ఉండబోమని తాఖీదు జారీ చేశాయి. పరిశోధన స్వాతంత్య్రం, ఉద్యోగ భద్రత, సంస్థ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తక్షణమే తన విధానాలపై పునరాలోచన జరుపాలని కోరుతున్నాయి. లేకపోతే ఆందోళనలకు దిగడమే కాకుండా, దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తల స్థాయిలో నిరసనలు ఉధృతం చేసే అవకాశమున్నదని తెలిపాయి. ఇది కేవలం ఉద్యోగుల అసంతృప్తి కాదు, ఇస్రో భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనకు ప్రతిబింబం. ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్ వంటి కొత్త సంస్థలు కూడా ఈ చర్చలోకి వస్తున్నాయి. ఆదానీ, అంబానీ వంటి దేశంలోని అగ్ర కార్పొరేట్ సమూహాలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టడం మరో కీలక చర్చకు దారితీస్తున్నది.
ప్రభుత్వ విధానాల మార్పులతో స్పేస్ రంగం ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరుచుకోవడంతో, ఈ భారీ కంపెనీలు రాకెట్ తయారీ, ఉపగ్రహ సేవలు, స్పేస్ టెక్నాలజీ వ్యాపారాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఒకవైపు ఇది పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుందనే వాదన ఉన్నప్పటికీ, మరోవైపు ఇస్రో వంటి ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని ఉపయోగించుకొని కార్పొరేట్లు అదే రంగంపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లేకపోవడం, స్పష్టమైన హద్దులు లేకపోవడం వల్ల సందేహాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేట్‌రంగ భాగస్వామ్యంతో అంతరిక్ష రంగం విస్తరిస్తుందని, పెట్టుబడులు వస్తాయని తద్వారా ఉద్యోగాలు పెరుగుతాయనేది ప్రభుత్వ వాదన. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. అయితే అందుకు ఇస్రోను బలిపెట్టకుండా చూడాలి. పరిశోధన, ఆవిష్కరణ, వ్యూహాత్మక నియంత్రణ.. ఇవన్నీ ఇస్రో చేతుల్లోనే ఉండాలి. కార్పొరేట్ సంస్థలు సహాయక భాగస్వాములుగా మాత్రమే ఉండాలి. నాయకత్వం మాత్రం ప్రభుత్వ సంస్థ చేతుల్లోనే ఉండాలి. లేకపోతే ప్రపంచం విస్తుపోయే అభివృద్ధిని సాధించిన ఇస్రో, రేపు కార్పొరేట్ లాభాల వేటలో తన అసలైన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది.