న్యూఢిల్లీ: భారత్లోని ఏ గ్రామం 2021 నాటికి ప్రాథమిక సేవలు, ఆరోగ్య బీమా సదుపాయం, మహిళల బ్యాంకు ఖాతా యాజమాన్యం వంటి అంశాలతో సహా బహుళ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను(ఎస్డీజీ) సాధించలేదని ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్-ఈస్ట్ ఏషియా జర్నల్లో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం పేర్కొంది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందినవారితో కూడిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఒక విషయాన్ని గుర్తించింది.
దాదాపు అన్ని గ్రామాలు 10-14 ఏండ్ల వయసుగల బాలికలలో కౌమార దశ గర్భధారణకు సంబంధించిన లక్ష్యాన్ని సాధించాయి. 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, భూమిని రక్షించడం కోసం చర్యలు తీసుకోవాలనే సార్వత్రిక పిలుపుగా 2015లో ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. జాతీయ, జిల్లా స్థాయిల్లో ఎస్డీజీల పర్యవేక్షణ అనేది గ్రామాల వంటి సూక్ష్మ భౌగోళిక ప్రాంతాలలో ఉండే అసమానతలను కప్పివేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. 2030 నాటికి ఎస్డీజీ లక్ష్యాలను చేరుకోవడానికి గ్రామాల అంతటా పెద్ద ఎత్తున వేగంగా కృషి చేయవలసిన అవసరం ఉందని బృందం పేర్కొంది.