న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దీపావళి, ఛత్పూజ లాంటి పండుగలకు సొంత ఊర్లకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించిన ప్రయాణికులకు ఐఆర్సీటీసీ చుక్కలు చూపించింది. కీలకమైన సమయంలో బుకింగ్ వ్యవస్థ స్తంభించిపోవడం, నిమిషాల్లోనే వేల టికెట్లు అయిపోవడం, టికెట్ రాకున్నా డబ్బులె కట్ అయిపోవడంపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను ఆన్లైన్లో షేర్ చేసుకుంటున్నారు. పండుగలకు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఉత్తరాది వారు ఇష్టపడతారు.
ఈ క్రమంలో రెండు నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవడానికి సిద్ధమైన పౌరులకు ఐఆర్సీటీసీ ముప్పుతిప్పలు పెట్టింది. సాంకేతిక సమస్య పేరిట సైట్ స్తంభించిపోయిందని, తీరా సైట్ సరిఅయిన తర్వాత చూస్తే టికెట్లు అన్నీ అయిపోయాయని వారు గగ్గోలు పెట్టారు. టికెట్ రాకపోయినా పూర్తి చార్జీ డబ్బులు మాత్రం బ్యాంక్ ఖాతాలోంచి కట్ అయిపోయాయని పలువురు వాపోయారు.