తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలి రోజే జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా కలవరపెట్టేవిగా ఉన్నాయి. సభలో ప్రతిపక్షం – అధికారపక్షం మధ్య రాజకీయ ఘర్షణలు జరుగడం కొత్త కాదు. కానీ శాసనసభ్యులు సభలోకి ప్రవేశించకముందే పోలీసుల ద్వారా అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేయడానికి వారు ఎంచుకున్న దుస్తులను కూడా ఒక సమస్యగా పరిగణించడం దారుణం. ముఖ్యంగా మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు కళంకం తీసుకొచ్చేవిగా ఉన్నాయి.
ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించడం ఒక నిరసన రూపం. అది సభా కార్యకలాపాలను అడ్డుకోవడం కంటే ముందే నేరంగా మారిపోదు. దుస్తులపై ఏవైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే వాటిని తీసేసి రమ్మని చెప్పవచ్చు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికే కాదు, ప్రతిపక్షానికీ ఉంటుంది. ఆ నిరసన సభా నియమాలను ఉల్లంఘిస్తే సభాపతి చర్య తీసుకోవచ్చు. కానీ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టకముందే పోలీసుల ద్వారా సభ్యులను అడ్డుకోవడం మాత్రం అత్యంత తీవ్రమైన పరిణామం. శాసనసభ్యులను పోలీసులు తోసేయడం, లాగడం, అడ్డుకోవడం ప్రజాస్వామ్య సంస్థల గౌరవానికి విరుద్ధం. మహిళా శాసనసభ్యుల విషయంలో పోలీసుల ప్రవర్తన మరింత ఆందోళన కలిగించే విషయం. మహిళా సభ్యులను పురుష పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు నిజమైతే, అది కేవలం పోలీసింగ్ పద్ధతిపై మాత్రమే ప్రశ్న కాదు, మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, భద్రత, హక్కులపై ప్రశ్న. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలువాల్సిన శాసనసభ గుమ్మం దగ్గరే ఇటువంటి దృశ్యాలు కనిపించడం మంచి సంకేతం కాదు.
దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘర్షణలు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాయి. తమిళనాడు శాసనసభలో జయలలితకు ఎదురైన అవమానకర ఘటనలు ఇప్పటికీ రాజకీయ చరిత్రలో మిగిలిపోయాయి. సభలో రాజకీయ ప్రత్యర్థిత్వం హద్దులు దాటితే అది వ్యక్తుల మధ్య ఘర్షణగా మొదలై, చివరకు సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తుంది. తెలంగాణ ఆ దారిలో నడువకూడదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల వివాదాన్ని కూడా రాజకీయ వివేకంతో చూడాల్సిన అవసరం ఉన్నది.
తాను చేసిన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి కాదని ఆయన స్పష్టంచేశారు. ఒకవేళ స్పీకర్‌కు అలా అనిపించినట్టయితే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని, తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని కూడా ప్రకటించారు. ఒక ప్రజాప్రతినిధి తన వ్యాఖ్యపై విచారం వ్యక్తం చేసిన తర్వాత కూడా అదే అంశాన్ని సభ మొత్తాన్ని స్తంభింపజేసే స్థాయికి తీసుకెళ్లడం అవసరమా అనేది ఆలోచించాల్సిన ప్రశ్న.
స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనది. ఆ పదవిని అవమానించేలా ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందే. అదే సమయంలో స్పీకర్ కూడా సభను అన్ని పక్షాలకు సమానంగా అందుబాటులో ఉంచే రాజ్యాంగబద్ధమైన పాత్రను పోషించాలి. ఒక సభ్యుడి వ్యాఖ్యను మొత్తం ప్రతిపక్షానికి, ఒక పార్టీకి, లేదా ఒక సామాజిక వర్గానికి అంటగట్టడం కూడా సరైన ప్రజాస్వామ్య పద్ధతి కాదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య తీవ్రంగా ఉన్నది. ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కోసం చూస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై ముందస్తు ప్రణాళిక అవసరమని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వాటి పరిష్కారంలో పారదర్శకత లేకపోవడం వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమస్యలపై సభలో సమగ్ర చర్చ జరుగాల్సిన సమయంలో సభ ఈ విధమైన గందరగోళమైన పరిస్థితిలో నడువడం, సభా సమయాన్ని వృథా చేయడం ప్రజల పట్ల అన్యాయం.
ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక విషయం గుర్తుండాలి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంటును నిర్వహించకుండా ఆటంకాలు కలిగిస్తున్నదని కాంగ్రెస్ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ప్రధాని, హోంమంత్రి సభకు రావాలని డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అదే రాజకీయ సంస్కృతి రాష్ట్ర శాసనసభలో అధికారపక్షంగా ఉన్నప్పుడు ఎందుకు మారాలి? ప్రజాస్వామ్యం అంటే అధికారపక్షం మాట్లాడటం కాదు. ప్రతిపక్షం మాట్లాడటం కూడా కాదు. అధికారపక్షం మాట్లాడినంత సమయం ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఉండటం. ప్రతిపక్షం నిరసన తెలిపినంత మాత్రాన దాన్ని అణచివేయకుండా, సభా నియమాల పరిధిలో ఎదుర్కోవడం, సభా సమయాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం. ఇదే ప్రజాస్వామ్య సంస్కృతి.
పోలీసులు ప్రభుత్వానికి రాజకీయ రక్షక దళం కాదు. వారు చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ. ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రభుత్వ శత్రువులు కాదు. వారు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు. ఈ రెండు వాస్తవాలను ప్రభుత్వం మరచిపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సోమవారం జరిగిన ఘటనను కేవలం కాంగ్రెస్బీఆర్ఎస్ రాజకీయ గొడవగా కొట్టిపారేయడం సరిపోదు. ఇది తెలంగాణ శాసనసభ ప్రతిష్టకు సంబంధించిన విషయం. సభ గుమ్మం దగ్గరే ప్రజాప్రతినిధులను అడ్డుకొనే పరిస్థితి ఏర్పడితే, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా అదే పద్ధతిని అనుసరించే ప్రమాదం ఉంటుంది కదా! ఒకసారి అధికారానికి ఈ మార్గం అలవాటైతే, ప్రతిపక్షంలోకి వెళ్లినప్పుడు అదే అధికారాన్ని విమర్శించే నైతిక హక్కు రాజకీయ పార్టీలకు బలహీనమవుతుంది.
జరిగినది ఎవరి విజయమూ కాదు. అధికారపక్షానిది కాదు, ప్రతిపక్షానిదీ కాదు. అది ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టం. శాసనసభ గుమ్మం ప్రజాప్రతినిధులకు మూసుకుపోయే రోజు ప్రజల గొంతుకకు కూడా తలుపులు మూసుకుపోయిన రోజు.
తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. అధికారపక్షం ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రతిపక్షం సభా నియమాలను గౌరవించాలి. స్పీకర్ అన్ని పక్షాలకు న్యాయమైన వేదిక కల్పించాలి. పోలీసులు రాజకీయ ఆదేశాల కంటే రాజ్యాంగబద్ధమైన బాధ్యతకు కట్టుబడి ఉండాలి. లేకపోతే శాసనసభ ప్రజాస్వామ్య చర్చల నిలయం కాకుండా, అధికార – ప్రతిపక్ష యుద్ధరంగంగా మిగిలిపోతుంది. ప్రజలు మాత్రం బయట నిలబడి తమ సమస్యలకు సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు.