కడెం: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (Grain procurement) అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఖానాపూర్ఎమ్మెల్యే వెడమ బొజ్జును ( MLA Vedama Bojju ) రైతులు నిలదీశారు. నిర్మల్ జిల్లా జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ ఎల్లాపూర్ గ్రామం వద్ద నిర్మల్- మంచిర్యాల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆరోపించారు.
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయిందని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతుల నిరసన సమాచారాన్ని తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోళ్ల జాప్యం పై ఎమ్మెల్యేకు రైతులకు నడుమ తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.