సిరిసిల్ల జిల్లా మొర్రాయిపల్లె రైతుల ఏకగ్రీవ తీర్మానం
ముస్తాబాద్, అక్టోబర్ 22: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంటల మార్పిడి చేపడుతామని మరో గ్రామ రైతులు ముందుకొచ్చారు. నూనెగింజలు, చిరు ధాన్యాలనే సాగుచేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెవాసులు ఏకగ్రీవ తీర్మానంచేశారు. సర్పంచ్ సడిమెల సుజాత అధ్యక్షతన రైతులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. యాసంగిలో వరికి బదులుగా పొద్దు తిరుగుడు, వేరుశనగ, సోయా, కంది వంటి పంటలు వేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు ఎల్లం, అల్లం లక్ష్మణ్, రైతుబంధు గ్రామశాఖ అధ్యక్షుడు పల్లె దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే ఇదే మండలంలోని మోహినికుంట రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేస్తామని తీర్మానంచేసిన విషయం తెలిసిందే.