పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకే నేటికీ సన్నధాన్యం బోనస్ డబ్బులు అందలేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సగం మంది రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇదిగో.. అదిగో.. అంటుండడంతో నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగి విసుగెత్తుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 10వేల మందికిపైగా రైతులు రూ.47.86 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ బోనస్ డబ్బులపై పౌర సరఫరాల శాఖ గానీ, జిల్లా అధికార యంత్రాంగం గానీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం తమకు అందాల్సిన బోనస్ డబ్బును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ రంగంతోపాటు రైతాం గం విషయంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ప్రచార ఆర్భాటానికే పరిమితమైనట్లు స్పష్టమవుతున్నది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాట అందరికీ తెలిసిందే. కానీ అధికారంలోకి రాగానే 2024 మార్చి సీజన్ యాసంగిలో బోనస్‌ను గురించే పట్టించుకోలేదు. ఇక వానకాలం నుంచి అమలు చేస్తామని చెప్తూ వచ్చారు. తీరా అన్ని రకాల ధాన్యానికి బోనస్ కాదూ… కేవలం సన్న ధాన్యానికి మాత్రమే అంటూ మెలిక పెట్టారు. అది కూడా తాము ఎంపిక చేసిన వెరైటీలకే అన్నారు. పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితేనే ఇస్తామని ప్రకటించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రుల మాటలను అప్పుడే రైతులు విశ్వసించలేదు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే… బోనస్ వద్దనుకునే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం నేరుగా రైస్‌మిల్లర్లకే విక్రయించారు.
కానీ చివర్లో కొంతమంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో సన్నాలను విక్రయించగా వారికి నేటికీ బోనస్ డబ్బులు అందకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తేనే బోనస్ వస్తుందని ఆశపడి అనేక ఇబ్బందులకు ఓర్చి అన్నదాతలు ధాన్యం విక్రయించారు. నేరుగా రైస్‌మిల్లర్లకు విక్రయించినా మద్దతు ధరకు మించి ధర వస్తున్నా సరే… బోనస్ కోసం ఆశ పడితే రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీని పూర్తిగా అమ లు చేయలేదు. ఇక రైతుభరోసా విషయంలోనూ మభ్యపెడుతూ వస్తున్నది. ప్రకటించిన విధంగా బోనస్ అయినా ఇస్తారనుకుంటే దానికి కూ డా ఎదురుచూపులు తప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.47.86కోట్లు పెండింగ్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.47.86 కోట్ల బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో కొద్దిమంది రైతులే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం తెచ్చారు. మెజార్టీ రైతులు కొనుగోలు కేంద్రాల్లోని షరతులకు భయపడి నేరుగా రైస్‌మిల్లర్లకే అమ్ముకున్నారు. కొంతవరకు మాత్రం చివరల్లో వచ్చిన సన్నాలను బోనస్ కోసం విక్రయించారు. ఇలా నల్లగొండ జిల్లాలో మొత్తం రూ.172.59కోట్ల విలువైన 74,393 మెట్రిక్ టన్నుల సన్నాలను 15,879 మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది.
వీటికి క్వింటాలు ఒక్కంటికి రూ.500 బోనస్ వర్తింపచేస్తే రూ.37.20 కోట్లు రైతులకు బోనస్‌గా అందాల్సి ఉంది. కానీ నేటికీ 37,186 మెట్రిక్‌టన్నులకు సంబంధించిన 8,110 మంది రైతులకు రూ.37.60 కోట్ల బోనస్ డబ్బులు అందలేదు. 50 శాతం సన్నాలకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. సూర్యాపేట జిల్లాలో 1.18లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేయగా రూ.59కోట్ల రూపాయల బోనస్ రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ కూడా రూ.30 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా 29 కోట్ల రూపాయలను పెండింగ్‌లో పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు చేసిందే చాలా తక్కువ. 1,171 మంది రైతుల నుంచి 4,647 మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి నేటికీ రూ.2.32 లక్షల బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
బోనస్ ఎప్పుడు ఇస్తరో చెప్తలేరు
నేను రెండున్నర ఎకరాల్లో పండిన 27 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో అమ్మాను. నెల రోజులు దాటినా బోనస్ పడలేదు. అధికారులకు ఫోన్ చేస్తే వస్తుందంటున్నారు తప్ప అకౌంట్లో వేయడం లేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మా చేతుల్లో ఏం లేదంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్ధమైతలేదు.
-లొడంగి భిక్షం, రైతు, కాసర్ల పహాడ్(అర్వపల్లి మండలం)
రెండు నెలలైనా బోనస్ లేదు
ప్రభుత్వం చెప్పినట్లు సర్కారు కొనుగోలు కేంద్రంలోనే 69 క్వింటాళ్లు సన్నవడ్లు అమ్మాను. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రెండు నెలలు దాటింది. ఇప్పటివరకూ అకౌంట్లో పడలేదు. రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. యాసంగి సీజన్‌కు పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నాం. రైతు భరోసా కూడా రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోనస్ ఇవ్వాలి.
-సత్తయ్య, రైతు, నాగారం
అసలు బోనస్ ఇస్తరా, ఇయ్యరా?
ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తమని చెప్పడంతో 50 క్వింటాళ్ల ధాన్యం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. వారం రోజుల్లో బోనస్ డబ్బులు ఖాతాల్లో పడుతాయని చెప్పారు. రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు రాలేదు. బోనస్ వస్తుందన్న ఆశతో తక్కువ దిగుబడులు వచ్చినా అధిక పెట్టుబడులు పెట్టి సన్నాలు సాగు చేశాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బోనస్ పేరుతో రైతులను మోసం చేస్తున్నది. అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ సమాధానం దాటవేస్తున్నారు. బోనస్ డబ్బులు అసలు ఇస్తరో, ఇయ్యరో తెలియడం లేదు.
-చిట్యాల రాజిరెడ్డి, రైతు, నారెగూడెం (కట్టంగూర్ మండలం)
తరుగే తప్ప బోనస్ రాలేదు
ఎకరం పొలం కౌలుకు తీసుకొని సన్న రకం నాటు పెట్టిన. పండిన పంటను నేరుగా దామరచర్ల ఐకేపీ కేంద్రానికి తీసుకుపోతే వారం రోజులు తప్పి కాంటా పెట్టారు. 16 క్వింటాళ్లు వడ్లు అయినయి. ధాన్యం డబ్బులు ఇచ్చినరు గానీ ఇంత వరకు బోనస్‌గా రావల్సిన 8వేల రూపాయలు రాలేదు. పొలం కౌలుకు ఇచ్చిన రైతు బోనస్‌తో కలిపి డబ్బులు తీసుకున్నడు. నాకు మాత్రం బోనస్ డబ్బులు రాలేదు. ఐకేపీ కేంద్రంలో అమ్మడంతో ధాన్యం తరుగుపోయింది. ఇప్పుడు బోనస్ రాక మరింత నష్టపోతున్నా.
-పడిగెపాటి సైదిరెడ్డి, రైతు, దామరచర్ల
మిల్లుకు అమ్ముకున్నా బాగుండేది
వానకాలం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మిల్లర్లు మంచి రేటు పెడుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 212 టిక్కీలు అమ్మాను. ఇప్పటికి 50 రోజులైంది. బోనస్ పడలేదు. తోటి రైతుల లెక్క మిల్లుకు అమ్ముకున్నా మంచి రేటు పడేది అనిపస్తున్నది ఇప్పుడు. ఉన్నది పాయె. బోనస్ రాకపా యె.
-వట్టెం తిరుపతయ్య, రైతు, కూచిపూడి గ్రామం(కోదాడ రూరల్)