Peddapally | పెద్దపల్లి, నవంబర్7: రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, డీఎంవోపీ ప్రవీణ్‌రెడ్డి, డీసీవో శ్రీమాలతో కలిసి అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు సాదారణ రకం రూ.2369, గ్రేడ్ ఏ రకం రూ.2389 అని తెలిపారు. సన్న వడ్లకు బోనస్ క్వింటాలుకు రూ.500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిబందన ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో రైతు బ్యాంక్ ఖాతాలో ధాన్యం డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పీఏసీఎస్ చైర్మన్ మాదిరెడ్డి నర్సంహారెడ్డి, పీఏసీఎస్ సీఈవో మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.