మొగుళ్లపల్లి, ఏప్రిల్ 22 : జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చేపట్టిన నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయభూముల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని, ప్రాణాలుపోయినా భూములు ఇచ్చేదిలేదని స్పష్టంచేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసుల సాయంతో అధికారులు రోడ్డుపనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ఆయా గ్రామాల్లో ఒకోరకంగా పరిహారం అందజేస్తున్నారని తెలిపారు. మండల కేంద్రంలో భూములు కోల్పోతున్న రైతులకు అతి తకువ పరిహారం అందజేస్తున్నారని ఆరోపించారు. తమ జీవనాధారమైన భూములను కోల్పోతున్నందున సరైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సునీత మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని, రైతులు సహకరించాలని కోరారు.