సూర్యాపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. నేడు అదే కాళేశ్వరం లిఫ్ట్‌ల మోటర్లు ఆన్ చేస్తే ప్రజలు, రైతులు విశ్వసించకపోగా ఈసడించుకొంటారని భయపడుతున్నదని అన్నారు. నేడు ప్రకృతి సిద్ధంగా వచ్చిన కరువు కాదని.. కేవలం కాంగ్రెస్ తెచ్చిన కరువేనని స్పష్టంచేశారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుల వద్ద మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని లేదంటే సూర్యాపేట నుంచి రైతులు, ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఆదివారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరిలో ప్రస్తుతం దాదాపు లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని కానీ ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు అనేక ప్రాంతాలకు మాత్రం నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కన్నెపల్లి వద్ద లిఫ్ట్ మోటర్లు ఆన్ చేస్తే నీళ్లు నేరుగా పంట పొలాల్లోకి చేరుతాయని, కానీ మోటర్లు ఆన్ చేస్తే విద్యుత్తు ఖర్చు అవుతుందని, అదీగాక కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని భావించి కాంగ్రెస్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రారంబించాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజలు ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వ మెడలు వంచాల్సి అవసరం ఉన్నదని సూచించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తిరుగుబాటు తప్పదని అది సూర్యాపేట నుంచే ప్రారంభం అవుతుందని హెచ్చరించారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లె ట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నామని అది చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా అమరావతి వెళ్తుందని ఏడాది కాలంగా చెప్తూ.. ఇప్పుడు రూట్ మారుతుందనడంపై జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. బుల్లెట్ ట్రైన్‌పై ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. కానీ ఈ రూట్ మార్చాలని ఆలోచించడం సరికాదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. ఈ ప్రాంత కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలని, చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్లేగా బీఆర్ఎస్ కూడా కృషి చేస్తుందని తెలిపారు.