యూరియా కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. వారి అవస్థలను సూడలేక క్యూలో నిల్చోవడానికి చెప్పులు సైతం తిప్పలు వడుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం ‘పాపం’ అని కనికరించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ్యల కోసం ఉరుకుతా ఉంటే.. పచ్చని చెట్లు సైతం కన్నీళ్లు రాలుస్తున్నాయి. అయినా, ‘రైతన్నా.. నీకు నేనున్నా..’ అని ఏ నాయకుడి కన్నూ చెమర్చడం లేదు.
ఈ విషపు కూడు మేం తినలేమంటూ గురుకులాల విద్యార్థులు గుక్కపట్టి ఏడుస్తున్నారు. వారి బాధలు సూడలేక తల్లిదండ్రులు ‘బిడ్డా.. మనకు గిదేం గోస..’ అని గుండెలు బాదుకుంటున్నారు. కానీ, ఏలికలకు చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. ఓ దిక్కు నీళ్లు లూటీ చేస్తూనే.. మరో దిక్కు ‘ప్రాజెక్టు పనికిరాద’ని విషప్రచారాలు చేయజూస్తున్నారు.
వెరసి అరచేతి వైకుంఠం పాలన అస్తవ్యస్థమైంది. అసత్యాల ప్రభుత్వంలో ప్రజల జీవనం దుర్భరమైంది. అందుకే, జన ప్రభంజనం జాగృతమై తిరగబడుతున్నది. పండుగ ఏదైనా ‘దేఖ్ లేంగే’ అని వార్నింగ్ ఇస్తున్నది. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెకు ఉద్యమించిన తెలంగాణ సమాజం నేడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తున్నది. సకలజనులకు మద్దతుగా కవిలోకం కలాలు ఝళిపిస్తున్నారు. కవనాలు నూరుతున్నారు. చీకటి పాలనపై వారు గురిపెట్టిన నిప్పుల తూటాల పరంపర ఇదీ…