న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమానికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. టిక్రి, సింఘు సరిహద్దుల నుంచి రైతులు ట్రాక్టర్లతో పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహిస్తారని, మధ్యలో ఎక్కడైనా అడ్డగిస్తే అక్కడే బైఠాయించనున్నట్టు రైతు సంఘాలు తెలిపాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రతిరోజు పార్లమెంట్ భవనం వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. కాగా, ఈ నెల 22న లక్నోలో నిర్వహించనున్న ‘కిసాన్ మహాపంచాయత్’ చరిత్రలో నిలిచిపోనున్నదని రైతు నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరగడం ఖాయమని, కేంద్రానికి ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు.