ఛండీగఢ్, నవంబర్ 10: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దుల్లో దారుణం చోటుచేసుకున్నది. పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ (45) అనే రైతు బుధవారం ఉదయం దీక్షా వేదిక దగ్గరున్న ఓ చెట్టుపై ఉరికి వేలాడుతూ కనిపించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని సోనిపట్‌లోని దవాఖానకు పంపించినట్టు కుండ్లి పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతుడిది ఆత్మహత్యగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
దాదాపు నెలరోజుల క్రితం సింఘు సరిహద్దుల్లోనే ఇలాంటి ఘటనే జరిగింది. దీక్షావేదికకు సమీపంలో లఖ్భీర్సింగ్ అనే కూలీ అత్యంత దారుణరీతిలో హత్యకు గురయ్యాడు. కాగా, వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింఘు సరిహద్దుల్లో ఏడాదిగా వందలాది రైతులు నిరసనలు చేపడుతున్నారు. రైతు నేతలతో కేంద్రప్రభుత్వం 11సార్లు చర్చలు జరిపింది. అయితే, చట్టాలను రద్దుచేసే వరకు తాము నిరసనలను విరమించబోమని అన్నదాతలు తేల్చిచెప్పారు.
మరణించిన రైతు గత మూడు, నాలుగు నెలల నుంచి నిరసనల్లో పాల్గొంటున్నట్టు రైతు నేత బల్వంత్ సింగ్ తెలిపారు. మరణవార్త తమకు బుధవారం ఉదయం 7 గంటలకు తెలిసినట్టు వెల్లడించారు.