హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో డిజిటల్ టెక్నాలజీతో రానున్న పెను మార్పులు రైతుల సాధికారతకు దోహదపడుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. పంటలసాగులో డ్రోన్ల వినియోగంతోపాటు వ్యవసాయభూముల సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. ఈ దిశగా తాజా బడ్జెట్లో డిజిటల్, సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం కల్పించామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాగుకు టెక్నాలజీని అందించి, మార్కెట్‌తో అనుసంధానం చేసి లాభదాయకంగా మార్చడంలో ఇక్రిశాట్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. వ్యవసాయంలో ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని తెలిపారు. దేశంలో 80% చిన్న, మధ్య తరగతి రైతులు ఉన్నారని, వీరు ఎన్నో సంక్షోభాలను చవి చూశారని, ఈ పరిశోధనలు వారికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. వాతావరణ మార్పులకు తట్టుకొనే వంగడాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని సూచించారు. దేశంలో 170 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. చిన్న కమతాలు కలిగిన రైతుల సాగు వ్యయాన్ని తగ్గించడంతోపాటు పంటల కాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతంచేయడానికి శాస్త్రవేత్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇక్రిశాట్ పరిశోధనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పంటల దిగుబడి పెరగడానికి దోహదపడిందని కొనియాడారు.
తెలంగాణలో పామాయిల్ సాగు లక్ష్యానికి కేంద్రం నుంచి అన్ని రకాలుగా తోడ్పా టు అందిస్తామని హామీ ఇచ్చారు. వంటల నూనెల ఉత్పత్తిలో సాధికారతకు జాతీయ మిషన్ ప్రారంభించామని చెప్పారు. ఆహార భద్రతతో పాటు పోషక ఆహార భద్రతపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక లోగో, పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. అంతకుముందు పరిశోధనల ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు. ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లను పరిశీలించారు. అక్కడి ప్రతినిధులు వాటి విశేషాలను తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యుస్ ప్రధానికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసారు.