హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌కు లైసెన్సు దక్కడం మరింత ఆలస్యం కానున్నది. ఈ లైసెన్సు జారీకి ఓ సాంకేతిక అంశం అడ్డంకిగా మారింది. రైతు డిస్కమ్‌పై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇటీవల బహిరంగ విచారణ పూర్తిచేసినప్పటికీ ఇంకా లైసెన్సు జారీచేయలేదు. అందుకు ఈ అడ్డంకే ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బహిరంగ విచారణకు ముందే విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 18 నిబంధనలు, టీజీఈఆర్సీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ రెగ్యులేషన్ నంబర్-4 2016ను సవరణ కోసం ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు ఈఆర్సీకి రెండు వేర్వేరు పిటిషన్లు సమర్పించాయి. వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 22 వరకు అవకాశం ఉన్నది. ఈ గడువు ముగిశాక అభ్యంతరాలపై డిస్కమ్‌లు లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రైతు డిస్కమ్‌కు లైసెన్సు జారీచేసే అవకాశం ఉన్నది.
రైతు డిస్కమ్‌కు కొత్త కనెక్షన్లు ఉండవు. ప్రస్తుతమున్న ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల పరిధిలోని కనెక్షన్లనే రైతు డిస్కమ్‌కు బదలాయించాలి. అలా దాదాపు 30 లక్షల కనెక్షన్లను రైతు డిస్కమ్‌కు బదలాయించాల్సి ఉన్నది. వాటిలో వ్యవసాయ కనెక్షన్లతోపాటు మిషన్ భగీరథ, జలమండలి, లిఫ్ట్ ఇరిగేషన్, మున్సిపల్ వాటర్ కనెక్షన్లు ఉంటాయి. ఈ కనెక్షన్లను రైతు డిస్కమ్‌కు బదలాయించేందుకు తమకేమీ అభ్యంతరం లేదని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు చెప్తున్నప్పటికీ విద్యుత్తు రంగ నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు డిస్కమ్ రూ.65 వేల కోట్ల అప్పులు, రెవెన్యూ లోటులో ఉన్నట్టు చూపడంతో ఇంత భారీ లోటుతో కొత్త డిస్కమ్ ఎలా నడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ నెల 22లోగా రైతు డిస్కమ్‌కు లైసెన్సు జారీచేసే అవకాశాలు కనిపించడం లేదు.