లింగంపేట, నవంబర్ 14: తెల్లారితే కూతురి నామకరణోత్సవం ఉండగా అంతలోనే పాము కాటుతో తండ్రిమృతిచెందాడు. దీంతో వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన రైతు మెట్టు ప్రభాకర్ (32) శనివారం రాత్రి శివారులోని పొలం వద్ద కాపలాకు వెళ్లాడు. అర్ధరాత్రి ప్రభాకర్‌కు కడుపులో తిప్పినట్టు కావడం, వాంతులు చేసుకోవడంతో పక్కనే ఉన్న మరో రైతు గమనించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డికి తరలించారు. ప్రభాకర్ చెవి వెనుక భాగంలో పాము కాటు వేయడంతో మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ప్రసన్న ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూతురు నామకరణోత్సవ వేళ తండ్రి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.