వేలేరు, నవంబర్ 4: దిగుబడులు సరిగా రాక.. పంట కోసం చేసి అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకున్నది. వేలేరు ఎస్సై అజ్మీరా సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన రైతు బెల్లం శ్రీశైలం (55) తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేశాడు. రెండు,మూడేళ్లుగా పంటలు కూడా సరిగా పండకపోవడంతో అప్పులయ్యాయి. దీనికితోడు కూతురు పెళ్లికీ అప్పు చేశాడు. మొత్తంగా రూ. 15 లక్షలు అప్పులు కావడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై సోమవారం తెల్లవారుజామున తన వ్యవసాయ బావి వద్ద గల పశువుల పాకలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేశ్ తెలిపారు.