వాంకిడి, నవంబర్ 2 : వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో తీవ్రమనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన రైతు బుట్లే సుధాకర్ (34) తనకున్న 5 ఎకరాలతోపాటు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. సుమారు రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రెండు నెలల క్రితం యూరియా కొరత, ఎడతెరిపి లేని వానలతో మొక్కలు సరిగా ఎదగలేదు.
ఇటీవల మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పత్తి పంట మరింత దెబ్బతిన్నది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వాంకిడిలోని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు వాంకిడి ఎస్సై మహేందర్ తెలిపారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.