హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తల్లిదండ్రులను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని, జీవితంలో రుణం తీర్చుకోలేనివారు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లిదండ్రులు మాత్రమేనని డీజీపీ జితేందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పోలీసు అకాడమీలో రాష్ట్ర డీజీపీగా చివరిరోజు ఆయనకు నిర్వహించిన వీడ్కోలు పరేడ్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఉద్యోగ రీత్యా కుటుంబం, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తన విధులను కుటుంబం ఆర్థం చేసుకున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. పంజాబ్లో పుట్టి పెరిగినా.. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు.