కూకటివేళ్లతో కూలిపోయిన పురాతన మర్రి చెట్టుకు ప్రాణం పోశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల శివారులోని 70 ఏండ్ల మర్రి చెట్టు మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు కుప్పకూలింది. నీరందకపోవడంతో నిర్జీవంగా మారింది.
అదే గ్రామానికి చెందిన ప్రకాశ్.. మోడు వారిన మర్రి చెట్టును చూసి కలతచెందాడు. మూడు నెలలుగా సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నీటిని తెచ్చి వేళ్లకు ఉన్న మట్టిని తడపడం మొదలు పెట్టాడు. రెండు నెలల తర్వాత ఎండిపోయిన మర్రి వృక్షం పచ్చగా చిగురించింది. ఈ చెట్టును మరోచోట రీట్రాన్స్లోకేషన్ చేయాలని కోరుతున్నాడు. ఇందుకు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని, పర్యావరణ ప్రేమికులు ముందుకువచ్చి సాయం చేయాలని కోరుతున్నాడు.