బెల్లంపల్లి రూరల్, నవంబర్ 19: మావోయిస్టుల పేరుతో ప్రముఖులను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వరంగల్ జిల్లా పరకాల మండలం నడికుడకు చెందిన తేలుకుంట్ల భిక్షపతి 1996 వరకు పీపుల్స్‌వార్ పార్టీలో దళ సభ్యుడిగా పనిచేసి ఆ తరువాత లొంగిపోయాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు కొంతమందితో ముఠా ఏర్పాటు చేసి.. తుపాకులు, కత్తులతో బెదిరింపు లు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నాడు. భిక్షపతితోపాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కారు, స్కూటీ, రెండు తల్వార్లు, రెండు వాకీటాకీలు, 50 మావోయిస్టుల లెటర్ ప్యాడ్స్ పేపర్లు, 7 సెల్ఫోన్లు, 2 కంట్రీమేడ్ పిస్టల్స్, 2 డమ్మీ పిస్టల్స్, 1 డమ్మీ రివాల్వర్, 1 ఎయిర్ పిస్టల్, ఒక 7.65 ఖాళీ రౌండ్ కేస్, ఒక 7.65 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు.