వీణవంక, డిసెంబర్ 29: మండల కేంద్రంలో కేబీ క్లినిక్ నిర్వహిస్తున్న అన్వర్ పాషా (Anwar Pasha) నకిలీ డాక్టర్ అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ అన్నారు. నర్సింగ్ చదివిన అన్వర్ పాషాకు వైద్యుడిగా అర్హతలు లేవు. అయినా కూడా అతడు సర్జరీలు, అబార్షన్లు చేస్తున్నాడనే సమాచారం మేరకు మండల కేంద్రంలోని కేబీ క్లినిక్‌లో మంగళవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, అధికారులు తనిఖీలు చేపట్టారు.
రిజిస్ట్రేషన్ లేకుండా అన్వర్ పాషా ఆసుపత్రి నడుపుతున్నారిని.. ఎంపీహెచ్ఐడబ్ల్యూ (ఏఎన్ఎమ్) కోర్సు చేసిన అతడు డాక్టర్‌నని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని తెలంగాణ మెడికల్ కౌన్సిల్, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ తెలిపారు. మెడికల్ కౌన్సిల్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా బెడ్లు ఏర్పాటు చేసి, ఐసీయూసెటప్లాగా, మానిటర్లు, ల్యాబ్ నిర్వహణ, ఆపరేషన్ పరికరాలు ఏర్పాటు చేశాడని వెల్లడించారు.
ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లా నిర్వహిస్తూ.. ప్రిస్క్రిప్షన్ ప్యాడ్, కెబీ డయాగ్నొస్టిక్ సెంటర్ పేరుతో టెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా అతడు స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తున్నాడని.. భవిష్యత్‌లో షుగర్, ఎముకలలో కాల్షియం తగ్గి మోకాళ్ళ, కిడ్నీ నొప్పులు వస్తాయని వారు చెప్పారు. మెడికల్ కౌన్సిల్ ప్రకారం నకిలీ డాక్టర్ అన్వర్ పాషా చేస్తున్నది చట్టరీత్యా నేరం కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. తనిఖీల్లో మెడికల్ కౌన్సిల్ కమిటీ సభ్యులు డా. సుధీర్, డా. వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.