భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ‘పేరు గొప్ప – ఊరు దిబ్బ’లా ఉంది కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పరిస్థితి. దేశ చరిత్రలోనే కలికితురాయంటూ కితాబిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి ఏడాదిలోనే ఆ యూనివర్సిటీని తడబాటుకు గురిచేస్తోంది. గత డిసెంబర్ 2న స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే కొత్తగూడెం వచ్చి ఈ యూనివర్సిటీకి ప్రారంభోత్సవం చేశారు. కానీ, అప్పటి నుంచి యూనివర్సిటీకి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఫ్యాకల్టీని కూడా నియమించలేదు.
దీంతో గెస్ట్ లెక్చరర్లతో క్లాసులు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలేజీలో విద్యార్థుల సంఖ్య ఉన్నా కొత్త భవనాలు లేవు. ప్రొఫెసర్లు కూడా లేరు. దీంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే సామెతలా ఉంది ఆ యూనివర్సిటీ పరిస్థితి. చివరికి ఆ కాలేజీకి రక్షణ గోడ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. బయట మాత్రం ఫెన్సింగ్ బోర్డులను ఏర్పాటు చేసి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నా వెనుక వైపంతా అడవిలా పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
1978లో మైనింగ్ కాలేజీగా మొదలైన కేఎస్ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) ఇంజినీరింగ్ కాలేజీ.. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అనుబంధమైంది. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే కాలేజీని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మార్చింది. దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ కాలేజీగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో బీటెక్, బీఎస్సీ, ఏఎస్సీ ద్వారా వివిధ కోర్సులను అందుబాటులో ఉంచింది. మైనింగ్, జియాలజీతోపాటు ఎర్త్ సైన్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
కానీ, ఎప్పటిలాగే పాత పోస్టులతో సరిపెట్టుకోవడం తప్ప కొత్త ఫ్యాకల్టీ వచ్చిన దాఖలాలు లేవు. రెగ్యులర్ ప్రొఫెసర్లు 10 మంది ఉంటే.. కాంట్రాక్ట్ పద్ధతిలో మరో ఏడుగురు ఉన్నారు. మిగతా 45 మంది అతిథి అధ్యాపకులే. ఇంకా 34 మంది అధ్యాపకులు అవసరం. 900 మంది విద్యార్థులకు పది మందే రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండడంతో విద్యాబోధన కూడా సక్రమంగా ముందుకు సాగడం లేదు. ప్రారంభోత్సవం నాడు పలికిన ప్రగల్భాలు తప్ప.. ఆ తరువాత ప్రభుత్వం దృష్టి పెట్టిన సందర్భమే లేదు. సరైన నిధులు కూడా ఇవ్వలేదు. దీంతో యూనివర్సిటీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.

04
ఇక హాస్టల్ విద్యార్థులకు సమయానికి భోజనాలు పెడుతున్నా వారికి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో యాజమాన్యం అప్పుల్లో మునిగిపోయింది. ఇప్పటికే యూనివర్సిటీ నుంచి రూ.40 లక్షలు అప్పు తెచ్చుకుని హాస్టల్ నడిపిస్తుంటే.. రూ.కోటి వరకు మెస్ బిల్లులు రాలేదు. దీంతో బయట వ్యాపారుల వద్ద అప్పులు పెరుగుతున్నాయి. ఇదేగాక ట్యూషన్ ఫీజులు కూడా రూ.కోట్లలో పేరుకుపోయాయి. మంత్రులు మాట ఇస్తున్నా అవి నెరవేరడం లేదు. ఇప్పటికీ సింగరేణి సంస్థ నిధులు ఇచ్చి ఆదుకుంటోంది.
పేరుకే కొత్త యూనివర్సిటీ. కానీ, బడ్జెట్లో కంటితుడుపుగా కేవలం రూ.45 కోట్లే కేటాయించారు. పాత బకాయిలే రూ.కోట్లలో ఉన్నాయి. ఫ్యాకల్టీ లేకుండా కాలేజీ పెడితే విద్యార్థులు ఎలా జాయిన్ అవుతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. విద్యార్థులకు గందరగోళం ఉండకూడదు. ఫ్యాకల్టీ సరిగా ఉందో లేదో అనే విషయాన్నే విద్యార్థులు మొదటగా చూసుకుంటారు. అందుకే ప్రైవేటువైపు మొగ్గు చూపుతున్నారు. సీఎం వచ్చినా నిధులు ఇవ్వకపోతే ఎలా? ఇప్పటికే అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి.
-ఎండీ యాకూబ్ పాషా, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రూ.కోట్ల నిధులు కావాలి. మొక్కుబడిగా నిధులు ఇస్తే సరిపోవు కాదా. వందల మంది విద్యార్థులున్న కాలేజీలో కనీసం గ్యాస్ సరఫరా కూడా కావడం లేదు. కట్టెల పొయ్యిల మీద భోజనం వండి పెడుతున్నారు. పెద్ద ఆవరణ ఉంది. కనీసం కాంపౌండ్ వాల్ లేదు. సీఎం వచ్చినా మార్పు రాలేదు. యూనివర్సిటీ నిధులు పుష్కలంగా ఉండాలి. సరైన నిధులు లేకుండా అప్‌గ్రేడ్ చేస్తే ఇలానే ఉంటుంది.
-కాలేరు సింధు తపస్విని, కొత్తగూడెం కార్పొరేటర్
యూనివర్సిటీ స్థాయి పెరిగితే అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. మొత్తం అంచనాలు వేసి రూ.300 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. మెస్ రూం, తరగతి గదులు, పెద్ద హాస్టల్ భవనం ఉండాలి. ముఖ్యంగా ప్రహారీ కూడా అవసరం. యూనివర్సిటీ నుంచి పోస్టులు మంజూరు కావాలి. అప్పుడే పరిపూర్ణత వస్తుంది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా సర్దుకుంటున్నాం. సమస్యలు లేకుండా ఉండవు. ఏ కాలేజీ అయినా సమస్యలు ఉంటాయి.
-టీ.జగన్మోహన్రాజు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్