న్యూఢిల్లీ: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. 2026 నుంచి కీలక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫేషియల్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్, మ్యాండేటరీ లైవ్ ఫొటోగ్రాఫ్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నది. జేఈఈ (మెయిన్), నీట్-యూజీ వంటి పరీక్షలకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
విస్తరించిన తనిఖీ పద్ధతులను అమలు చేసిన మొదటి పరీక్షగా 2026 జనవరిలో జరిగే జేఈఈ (మెయిన్) నిలుస్తుంది. పరీక్షల ప్రక్రియలో వివిధ దశల్లో అభ్యర్థులను ఎప్పటికప్పుడు అధికారికంగా ధ్రువీకరించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందని అధికారులు చెప్పారు. ఒకరికి బదులుగా వేరొకరు పరీక్షలు రాయడం, అనుచిత చర్యలకు పాల్పడటం వంటివాటిని నిరోధించవచ్చునని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయి పోటీ పరీక్ష జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వాడనున్నారు. తర్వాత అన్ని పోటీ పరీక్షలకు ఏఐ టూల్స్‌ను వినియోగించనున్నారు. మూల్యాంకనంలోనూ ఏఐని వినియోగించే అంశాన్ని కేంద్ర పరిశీలిస్తున్నది.