శాయంపేట, నవంబర్ 10 : దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా మారింది చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.10.30 కోట్లు ఇచ్చినా కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయలేదు. ఈ సెప్టెంబర్‌తోనే అగ్రిమెంట్ గడువు ముగిసింది. గతేడాది పనులు సజావుగా జరిగేందుకు యాసంగి తైబందిని బంద్ చేశారు. కానీ పనులు జరగకపోవడంతో మళ్లీ ఈ యాసంగికి కూడా నిలిపివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
శాయంపేట మండలం జోగంపల్లి శివారులో 1964లో చలివాగు ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచి నిధులు విడుదల చేయకపో వడంతో శిథిలావస్థకు చేరింది. భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో పరకాల నియోజకవర్గం, శా యంపేట మండలానికి తాగునీటిని అందిస్తున్నది. ఈ క్రమంలో చలివాగు ప్రాజెక్టు ఆధునీకరణకు గత కేసీఆర్ సర్కారు రూ.10.30 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పూర్తయి కాంట్రాక్టర్ పనులు చేపట్టినా పురోగతి లేదు. నాలుగు కిలోమీటర్ల దూరం కాల్వ లైనింగ్ పనులకు కేవలం 200 మీటర్లే వేశారు. కట్టపై నాసికరం మట్టిని పోసినట్లు ఆరోపణలు న్నాయి. తాత్కాలికంగా సిమెంట్‌తో తూము నిర్మించారు. పాతదాని స్థానంలోనే చేయడం గమనార్హం.
దీని పనులు ఇంకా పూర్తి కాలేదు. చలివాగు పనులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు మార్లు కాంట్రాక్టర్‌ను మార్చాలని సూచించారు. ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులు ఎప్పుడు జరుగుతాయో అన్న అయోమయం నెలకొంది. ఆయకట్టు కింద యాసంగికి సుమారు 1400 నుంచి 1700 ఎకరాలు తైబంది ఇచ్చి రైతులు సాగు చేసుకునేవారు. కానీ అభివృద్ధి పనుల కోసం గత యాసంగిలో తైబందిని అధికారులు బంద్ చేశారు. జూన్‌లో కాల్వ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పనుల అగ్రిమెంట్ సెప్టెంబర్‌తో ముగిసింది. ప్రస్తుతం చలివాగు ఆయకట్టు కింద వరి కోతకు సిద్ధమైంది. అభివృద్ధి పనుల కోసం ఈసారి కూడా తైబంది నిలిపివేసి పనులను పూర్తి చేసే ఆలోచనలో అధికారులు న్నారు. మరోసారి సుమారు 1500 ఎకరాల ఆయకట్టు సాగుకు బ్రేక్ పడనున్నది. దీంతో రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండడంతో పనులు ఆగిపోయాయి. ఈ యాసంగికి మరోసారి తైబంది బంద్ చేయాల్సి వస్తుంది. అట్లయితేనే పనులు జరుగుతాయి. కట్టపై మట్టి పోశారు. ఇంకా చేయాల్సి ఉంది. తూము పనులు ఇంకా జరగాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పను లు ఇరవై శాతం కాలేదు. ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చాం. ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
– గిరిధర్, ఐబీ డీఈ