ఒకప్పుడు 50 ఏండ్లు దాటిన వాళ్లలోనే ఎక్కువగా రక్తపోటు, డయాబెటిస్ సమస్యలను చూసేవాళ్లం. కానీ, ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ పలకరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం ఇందుకు ప్రధాన కారణాలు! బీపీ, డయాబెటిస్ రుగ్మతలు ఒక్కసారి పలకరిస్తే.. వాటిని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా తగ్గించలేం. అందువల్ల వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకోసం కొన్నిరకాల ఆహార పదార్థాలను పరగడుపున తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.
ఉసిరి : ఉసిరి కాయల్లో విటమిన్-సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఖాలీ కడుపుతో తినొచ్చు. పొడి చేసుకుని నీళ్లలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది, శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే జీవక్రియలు సాఫీగా సాగడానికి సాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూనే, బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
దాల్చినచెక్క : పరగడుపున దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడిని నీళ్లలో కలుపుకొని తాగాలి. దీనివల్ల షుగర్, రక్తపోటు స్థాయులు పెరగకుండా ఉంటాయి. అలాగే ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
మెంతులు : మెంతుల్లోని సాల్యుబుల్ ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర కలిసే పద్ధతి నెమ్మదిగా జరుగుతుంది. రాత్రుళ్లు మెంతులను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇది రక్తపోటును తగ్గించడంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెడుతూనే, రక్తపోటునూ తగ్గిస్తాయి. పరగడుపున రోజూ అవిసె గింజల పొడిని నీళ్లలో కలుపుకొని తాగితే మంచి గుణం కనిపిస్తుంది. ఇవి పాటించడానికి ముందు వైద్యుణ్ని సంప్రదించి, సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.