హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో మరోసారి టీఆర్ఎస్ గెలువడం ఖాయమైంది. సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు, స్థానిక నేతలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ హోరాహోరీగా సాగినా.. ఆ తర్వాత ట్రెండ్ మారిందని, సాయంత్రం మాత్రం ఏకపక్షంగా జరినట్టు చెప్తున్నారు. ఇది టీఆర్ఎస్కు అనుకూలమని పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు.. పోలింగ్ కేంద్రంలో మరో ఆప్షన్ లేకుండా కారు గుర్తుకే ఓటేసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయంగా జన్మ ఇచ్చి.. ఎదుగుదలనిచ్చిన పార్టీకి ఈటల రాజేందర్ చేసిన ద్రోహాన్ని, ఇన్నేండ్లుగా గెలిపిస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పించని ఆయన అసమర్థతను ప్రజలు బేరీజు వేసుకున్నారు. మరోవైపు తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీకి, అన్నలాంటి కేసీఆర్‌కు ద్రోహంచేసిన ఈటలకు బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో దాదాపు నాలుగు నెలలుగా టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఈటల అవకాశవాదంతో బీజేపీలో చేరడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపుతో ఆ పార్టీ నడ్డి విరుస్తుండటం వంటివి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయని విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ చరిష్మా ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేయనున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి నుంచి యువత టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నది. ఆసరా పింఛన్లతో ఆదుకున్న సీఎం కేసీఆర్‌ను వృద్ధులు తమ సొంత వ్యక్తిగా చూస్తున్నారు. వీటితోపాటు పలు కుల వృత్తులకు జీవం పోశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రాష్ట్రంలోని రైతులంతా టీఆర్ఎస్ వెన్నంటే ఉంటున్నారు. ప్రతి ఎన్నికలోనూ ఆయా వర్గాలు టీఆర్ఎస్ను విజయతీరాలకు చేర్చుతున్నాయి. హుజూరాబాద్‌లోనూ ఇది ప్రతిబింబించిందని, ఆయా వర్గాల ఓటర్లంతా గంపగుత్తగా టీఆర్ఎస్కు ఓటేశారని విశ్లేషకులు చెప్తున్నారు.
హుజూరాబాద్‌లో పోలింగ్ ప్రక్రి య తొలుత మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి జోరు పెరిగింది. సాయంత్రానికి ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసీ విధించిన గడువు ముగిసినా పదుల సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకు పోలింగ్ సరళిని బట్టి దాదాపు 75-77 శాతం ఓట్లు పోల్ అవుతాయని అందరూ అంచనా వేశారు. కానీ, దాదాపు 10-12 శాతం అదనంగా ఓట్లు పడ్డాయి. ఇదంతా సైలెంట్ వేవ్ అని.. ఇవన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్కే పడినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.