హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో మరో అవినీతి దందాకు తెరలేచింది. జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో వందల కోట్ల రూపాయలు వచ్చే రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేబీఆర్ పార్కు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు పేరుతో ఒకరికి, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానా, ఎంజే మార్కెట్ వద్ద జీవో నం 68 కి విరుద్ధంగా పేరొందిన యాడ్ ఎజెన్సీకి ప్రకటనలకు అనుమతి ఇచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో జీవో 68ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అడ్వర్టయిజ్మెంట్ పాలసీలో సంస్కరణలు తీసుకువస్తామని, ఈ పరిశ్రమపై ఆధారపడిన 209 ఏజెన్సీలకు మేలు జరిగేలా చేస్తామని నమ్మబలికింది. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్లేటు ఫిరాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 68ని పక్కాగా ఆమలు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. నిబంధనల ప్రకారం ఏదైనా వాణిజ్య ప్రకటనల కోసం ఏర్పాటు చేసే బోర్డులు 15 ఫీట్లకు తగ్గకుండా ఉండాలి. కానీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఒకరిద్దరి కోసం జీవో 68 నుంచి మినహాయింపు ఇచ్చింది. కేబీఆర్ పార్కు, ఎల్వీ ప్రసాద్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ఎల్ఈడీ ప్రకటనలను అస్మదీయులకు కట్టబెట్టింది.
జీహెచ్ఎంసీకి నామమాత్రంగా ఫీజులతో సరిపెట్టి, నిర్వహణ ముసుగులో సదరు ఏజెన్సీకి ఏటా రూ.కోట్లు లబ్ధి చేకూర్చిందని చర్చ జరుగుతున్నది. ఈ రెండు ప్రాజెక్టులతో ఆగకుండా భారీ అవినీతికి ప్లాన్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 23 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ)లను ఒకటిరెండు ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఎఫ్‌వోబీలను ఐదేండ్లపాటు నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గుడ్డిగా ఆమోద ముద్ర వేశారు. ఏజెన్సీలకు దోచిపెట్టే ఈ నిర్ణయానికి ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు ఓకే చెప్పడంతో ఆగమేఘాల మీద ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి చేరింది. జీవో 68 నుంచి మినహాయింపు ఇవ్వాలని జీహెచ్ఎంసీ ప్రకటన విభాగం ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలో కోరింది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ వచ్చిన ఐదేండ్లపాటు నిర్వహణ ము సుగులో ప్రకటనల దందాను ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లేలాపావులు కదుపుతున్నట్టు సమాచారం.
ఆప్తులకు రూ.వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పజెప్పే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతున్నది. ఇటీవల గ్రేటర్ మున్సిపాలిటీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన అవుట్ డోర్ మీడియా ప్రకటనల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. జీవో 68 నుంచి మినహాయింపులు ఇవ్వడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన 209 ఏజెన్సీల పొట్ట కొట్టేలా వ్యవహరించింది. దీంతో వందలాది ఏజెన్సీల నిర్వహకులు ఇప్పటికే రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగంపై న్యాయపోరాటానికి దిగారు. వచ్చే నెల 6న న్యాయస్థానం తీర్పు వెలువరించనున్నది. గతంలో ఏటా జీహెచ్ఎంసీకి ప్రకటనల రూపంలో రూ.80 కోట్ల మేర ఆదాయం వచ్చేది. అయితే గత ఏడాదిన్నర కాలంగా రూ.30 కోట్లు కూడా రాలేదు. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం వల్లే ఖజానాకు నష్టం కలిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఎఫ్‌వోబీలను జీహెచ్ఎంసీయే నిర్వహిస్తున్నది. ఒక్కో ఎఫ్‌వోబీకి ఏటా రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నది. కానీ ఇప్పుడు నిర్వహణను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి, ప్రకటనల నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. అధికారుల ప్రతిపాదనలపై లోతైన విశ్లేషణ చేసి జీహెచ్ఎంసీకి ఆర్థికంగా మేలు జరిగేలా చూడాల్సిన స్టాండింగ్ కమిటీ, నామమాత్రపు ఫీజులతో ఏజెన్సీలకు ఎఫ్‌వోబీలు కట్టబెట్టాలన్న తీర్మానానికి ఆమోద ముద్ర వేయడం గమనార్హం. స్టాండింగ్ కమిటీలో ఆమోద ముద్ర వేసిన ఎజెండానే సర్వసభ్య సమావేశంలో పెట్టి, ప్రభుత్వానికి పంపాలి. సర్కారు ఆదేశాల ప్రకారం టెండర్ ప్రక్రియ జరపాలి. కానీ స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసిన వెంటనే ప్రకటనల విభాగం అధికారులు జీవో 68 నుంచి ఎఫ్వోబీలకు మినహాయింపు ఇస్తే టెండర్లు పిలుచుకునేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని కోరారు.రెండు రోజుల్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నదని అధికారులు చెప్పారు.
దీప్తిశ్రీ నగర్, ఐడీపీఎల్ కాలనీ, మూసాపేట్, షాపూర్‌నగర్, బంజారాహిల్స్ రోడ్ నం.1, పంజాగుట్ట సిగ్నల్, ఈఎస్ఐ దవాఖాన, ఎన్ఎండీసీ, పురపాలక శాఖ కార్యాలయం మాసబ్ట్యా ంక్, మల్కంచెరువు, సెయింట్ యాన్స్ స్కూల్, తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్, నేరెడ్మెట్ క్రాస్ రోడ్, బుద్వేల్ రైల్వే స్టేషన్, కాటేదాన్, బాబానగర్, హసన్‌నగర్, ఏఎస్ రావు నగర్, రంగారెడ్డి కోర్టు కొత్తపేట, రామంతాపూర్, ఎన్టీఆర్ గార్డెన్, దిల్సుఖ్నగర్ చందనబ్రదర్స్, జేపీ సినిమాస్ చందానగర్ ప్రాంతాలలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నారు.