సర్వమతాలకు సమప్రాధాన్యత కేసీఆర్ ఘనతే అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని మతాల ప్రధాన పండుగలు అధికారికంగా నిర్వహించుకుంటున్నాం అని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఆదివారం సూర్యాపేటలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ..’గతఏడాది వరకు బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ దుస్తులు పంచుకున్నాం.. ఇఫ్తార్, ప్రేమ విందులతో ఐక్యతను పెంచుకున్నాం’ అని చెప్పారు.
‘కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే పండుగలకు దుస్తులు మాయమైనయ్. వచ్చే ఏడాది వరకు ఇంకేం వుంటాయో, పోతాయో చెప్పలేం. పండుగ వేడుకల్లో రాజకీయాలు మాట్లాడటం మాకు అలవాటు లేదు.
కానీ రోజురోజుకూ ఈ ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే తప్పడంలేదు. హామీలు, అభివృద్ధి మాట దేవుడెరుగు. పండుగలను కూడా పట్టించుకోకపోతే ఎట్లా. క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలి. ప్రజలందరిపై యేసుప్రభు ఆశీస్సులు ఉండాలి’ అని పేర్కొన్నారు.