హైదరాబాద్ : అసెంబ్లీలో తాము పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే.. వాళ్ల బండారం బయటపడుతుందనే తమకు అవకాశం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అయినా తాము ఊరుకునేది లేదని, కృష్ణా జలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణభవన్‌లో ఇవాళ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన హరీశ్‌రావు.. కేసీఆర్ నాయకత్వంలో మరో జలపోరాటానికి శ్రీకారం చుడుతామని చెప్పారు.
ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘అసెంబ్లీలో మేం పీపీటీ ఇస్తే, కాంగ్రెస్ బండారం బయట పడిపోతుందని భయపడి మాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయినా మేం ఊరుకోం.. కృష్ణా జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం. కేసీఆర్ నాయకత్వంలో మరో జల పోరాటానికి శ్రీకారం చుడతాం’ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పాలనలోనే కృష్ణా జలాల్లో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందని అన్నారు.
అసలు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతనో కూడా అవగాహన లేని వీళ్ల తెలంగాణ నీటి హక్కులను కాపాడుతరా..? అని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అబద్ధాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. ఎస్ఎల్బీసీపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు.