Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బేసిన్లు గూడా సక్కగ తెల్వయని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ల ఉందో ఆయన చెప్పలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కృష్ణా నీళ్లను తాకట్టు పెడుతున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో కృష్ణా నీళ్ల అతి తక్కువ వినియోగం జరిగిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఈ పదకొండున్నర ఏళ్లలో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది రేవంత్ పాలనలోనేనని చెప్పారు.
రేవంత్ రెడ్డి సర్కారు ఒక చెరువు తవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదని, వీళ్లు నీళ్ల గురించి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుందని రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేస్తున్నారని, అసలు 299ను పుట్టించిందే రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఆ ఉన్న తాత్కాలికంగా ఒప్పందం మేరకు 299 టీఎంసీల నీటిని కూడా రేవంత్ సర్కారు వినియోగించుకోలేకపోయిందని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ అడుగులకు మడుగులు వత్తుతూ తెలంగాణకు, పాలమూరుకు అన్యాయం చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. గోదావరిలో మాకు 500 టీఎంసీల నీళ్లు చాలు, మిగిలిన నీళ్లన్నీ మీరే తీసుకుపోండి అని రేవంత్‌రెడ్డి ఇప్పటికే చంద్రబాబుకు సెలవిచ్చారని, ఆ మాట చెప్పే హక్కు ఆయనకు ఎక్కడిదని హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు నీకు గురువు కావచ్చు, తెలంగాణకు కాదని అన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణిని కూడా హరీశ్‌రావు ఎండగట్టారు. రేవంత్‌రెడ్డి ఓ సారి చంద్రబాబు తనకు గురువు అని చెప్పుకుంటాడని, మరోసారి చంద్రబాబు నాకు గురువు అన్నోని గుండు మీదికెళ్లి తంతా అంటాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి దేవత అంటడు, బలి దేవత అంటడు, గురువు అంటడు, గుండుమీదికెళ్లి తంతా అంటడని, ఆయన నోరుకే మొక్కాలని వ్యాఖ్యానించారు.