పాలకుర్తి, జూన్ 3: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, తుమ్మలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి బుధవారం ఎర్రబెల్లి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వడ్లు తడిశాయని, రెండు నెలలైనా కాం టా పెట్టడం లేదని రైతులు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేవని చెప్పడం సరికాదని హితవు పలికారు. కాం టాలు కాక ఓ పక్క, కాంటా అయిన ధాన్యాన్ని మిల్లుల వద్ద దింపుకోలేక మరో పక్క రైతు లు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.