సిద్దిపేట, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మూడో డిస్కమ్ రైతులపాలిట శాపం గా మారనున్నది.. ఈ డిస్కమ్ వల్ల సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంట్ కోతలు తప్ప వు. దమ్ముంటే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు చాలెంజ్ చేశారు. పగలు మాత్రమే ఉండే సోలార్ పవర్‌తో 24గంటల కరెంట్ ఎలా ఇస్తారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 24గంటల ఉచి త కరెంట్ కోసమే కొత్త డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి చెప్పడం పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు రోజుకు 13గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని, రైతు డిస్కమ్ ఏర్పాటుతో 7-8గంటలే ఇచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
గుజరాత్లో 7గంటలు, కర్ణాటకలో 8గంటల మాత్రమే వస్తున్న బడే భాయ్ మోదీ విధానాలను అమ లు చేసేందుకు చోటా భాయ్ యత్నిస్తున్నారని విమర్శించారు. రైతు డిస్కమ్‌లో సౌర విద్యుత్ మాత్రమే ఇస్తామని జీవో నెంబర్ 8లో పేర్కొన్నారని.. ఆ విద్యుత్తుతో ఎత్తిపోతల ప్రాజెక్టుల మోటర్లు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటును వెంటనే రద్దు చేసి, రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర విద్యుత్తురంగ భవిష్యత్తుపై ఆయన పలు కీలక అంశాలతో పాటు సాక్ష్యాలను వెల్లడించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కరెంట్ కష్టాలు తప్పవని తేల్చిచెప్పారు. ఆర్పీడీసీఎల్ తో రైతులకు ఉచిత విద్యుత్ రాకపోగా, అది వ్యవసాయరంగానికి ఉరితాడుగా మారబోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈఆర్సీ ముందు జరిగిన బహిరంగ విచారణలో కాంగ్రెస్ అధికారికంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ద్వారా రైతాంగానికి 3గంటల కరెంట్ చాలు అని చెప్పించిందని, గతంలో రేవంత్ అదే మాట అన్నారని గుర్తుచేశారు.
కొత్త డిస్కమ్ ఏర్పాటుచేయాలనే ప్రభు త్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలోని కాళేశ్వరం, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, సీతమ్మసాగర్ లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ప్రమాదంలో పడుతాయని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003 ప్రకారం ఎవరికైనా కనెక్షన్ ఇవ్వాలని హరీశ్‌రావు చెప్పారు. కానీ ఆర్పీడీసీఎల్ వల్ల ఒకేచోట రెండు లైన్లు, రెండు స్తంభాలు వేయాల్సి వచ్చి రైతుల భూములు దెబ్బతినడమే గాక, ప్రజాధనం వృథా అవుతుందని.. ఇదొక తుగ్లక్ చర్య అని విరుచుకుపడ్డారు. ముంబై, బెంగళూరు మాదిరిగా లాభాలు వచ్చే డిసమ్లను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి, ఉచిత కరెంటును పకన పెట్టే కుట్రలో భాగంగానే రేవంత్ ఈ మూడో డిసమ్ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి డిస్కమ్‌లపై చర్చించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వల్లే డిసమ్ అప్పుల పాలైందని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో డిసమ్లకు ప్రభుత్వం రూ.27వేల కోట్లు బకాయి పడితే, కాంగ్రెస్ పాలనలో రెండేండ్లలోనే రూ.25,284 కోట్లు బకాయి పడిందని తెలిపారు. అంటే ఏడాదికి 10వేల కోట్లు అప్పులపాలు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులుచెరిగారు.
‘నా జీవితమంతా కేసీఆర్ వెంటే.. బతికున్నంత వరకు బీఆర్ఎస్లోనే.. ఇప్పటికి వంద సార్లు చెప్పాను, మళ్లీ చెబుతున్నా.. నా పుట్టుక, నా ప్రయాణం అంతా బీఆర్ఎస్తోనే’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘జీవితాంతం ఒకే పార్టీ.. పుట్టుక బీఆర్ఎస్లోనే.. చావు బీఆర్ఎస్లోనే. నువ్వేంది చిల్లరోనివి.. పూటకో పార్టీ మారే రేవంత్‌కు నా గురించి మాట్లాడే నైతిక హకు ఉందా?’ అని నిప్పులు చెరిగారు. దేవుండ్ల మీద ఒట్టేసి రుణమాఫీ ఎగబెట్టిన రేవంత్ తన ఇంటి పేరును అబద్ధాల రేవంత్‌గా మార్చుకోవాలని చురకలంటించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి, గుండు భూపేశ్, కాముని శ్రీనివాస్, రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.