హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఢిల్లీ సమావేశానికి వస్తమని గతంలో ఢిల్లీకి ఉత్తరం రాసిందని, ఇప్పుడు ఆ కండిషన్లకు కేంద్రంగానీ, ఏపీ సర్కారుగానీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎగేసుకుని మీటింగ్‌కు ఎందుకు పోయినట్లని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. రేవంత్ సర్కారుపై విమర్శల వర్షం గుప్పించారు.
హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘రెండు కండీషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్‌కు వస్తం అన్నరు. మొదటి కండీషన్ ఏమిటంటే.. నల్లమల సాగర్‌కు డీపీఆర్ వెంటనే ఆపాలి. కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం ఆపాలి. ఇక రెండో కండిషన్ ఏమిటంటే.. ప్రీ ఫీజబిలిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామి ఇవ్వాలి. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే.. ఈ రెండు కండీషన్లకు కేంద్రం హామీ ఇచ్చిందా..? ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందా..? నీ అప్రూవల్‌తోనే లెటర్ వెళ్లిందిగా ఉత్తమ్‌గారూ.. ఎందుకు హామీ లేకుండా పాల్గొంటున్నారు..?’ అని ప్రశ్నించారు.
‘ఈరోజు మీటింగ్‌కు ఎందుకు ఎగేసుకుని పోయారు..? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు సరే.. మీరైనా ఎందుకు పట్టించుకోరు ఉత్తమ్గారు..? ఈ మీటింగ్‌కు వెళ్లేది ఆదిత్యనాథ్. గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న ఆదిత్యనాథ్ దాస్.. కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ అన్నీ అక్రమ ప్రాజెక్టులని, వాటిని నిలిపివేయాలని చెప్పాడు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్‌కు పంపడం అంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కదా..?’ అని హరీష్‌రావు నిలదీశారు.