పాలకుర్తి రూరల్, నవంబర్ 6: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే.. దొడ్డు వడ్లు కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. దొడ్డు వడ్లు కొనుగోలుచేస్తామని కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే రైతుల పక్షాన బీజేపీ నేతల కాళ్లు పట్టుకొంటామని పేర్కొన్నారు. బీజేపీ నేతలు తమ సవాల్‌ను స్వీకరించకుండా ఎందుకు పరారవుతున్నారని ప్రశ్నించారు. శనివారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పాలకుర్తి, దర్దేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులను ఆందోళనలకు గురిచేయడం.. బీజేపీ, కాంగ్రెలకు అలవాటైందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నల్లచట్టాలను తెచ్చి రైతులను ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల మోటర్లకు స్టాటర్లను బిగించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలుచేస్తున్న మహాత్ముడు కేసీఆర్ అని కొనియాడారు.