Supreme Court : పాదచారులకు (Pedestrians) రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని (Encroachment-Free Space) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాదచారులు నడిచే మార్గం మోటార్ వాహనాలు ప్రయాణించే మార్గానికి విడిగా ఉండాలని పేర్కొంది. విడిగా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రదేశాల్లో రోడ్లకు, ప్రజలు నడిచే ప్రదేశానికి మధ్య తాడు అయినా కట్టాలని సూచించింది.
రహదారుల పక్కన ఉండే ఖాళీ స్థలం తమ కోసమేనని, వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవగలమని పాదచారులకు నమ్మకం కలిగించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. అనంతరం పాదచారుల కోసం చేసిన ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విషయాన్ని తదుపరి విచారణ కోసం రెండు వారాలకు వాయిదా వేసింది. ఫుట్‌పాత్‌లపై నడవడం కూడా ప్రజల ప్రాథమిక హక్కులలో భాగమని పేర్కొన్నది.