దుబాయ్: బౌలర్ల సమిష్టి కృషికి టాపార్డర్ దంచుడు తోడవడంతో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఫించ్ (44) ఒంటరి పోరాటం చేయగా.. వార్నర్ (1), స్మిత్ (1), మ్యాక్స్‌వెల్ (6), స్టొయినిస్ (0) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జోర్డాన్ 3, వోక్స్, మిల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జోస్ బట్లర్ (32 బంతుల్లో 71 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఇంగ్లండ్ 11.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసింది. బౌలర్‌తో సంబంధం లేకుండా బట్లర్ విధ్వంసం సృష్టించడంతో ఇంగ్లండ్ 50 బంతులు మిగిలుండగానే విజయం సాధించి రన్‌రేట్ మెరుగు పర్చుకుంది.
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 125 ఆలౌట్ (ఫించ్ 44; జోర్డాన్ 3/17),
ఇంగ్లండ్: 11.4 ఓవర్లలో 126/2 (బట్లర్ 71 నాటౌట్; అగర్ 1/15).