హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అర్చక ఉద్యోగులపై వివక్ష వీడాలని, ఒకే శాఖలో చేస్తున్న వారందరికి ఒకే వేతన విధానం అమలు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. దేవాదాయశాఖ చట్టాన్ని సవరించాలని కోరుతూ బుధవారం బోడుప్పల్‌లోని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టుశ్రీనివాసాచార్యులు అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యో గ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో అర్చక ఉద్యోగులు డిమాండ్ల సాధ న కోసం ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్‌శర్మ మాట్లాడుతూ దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ కార్యాలయ సిబ్బంది వరకు ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతుండగా, దైవసేవలో ఉన్న 40 శాతం మంది అర్చకులకు గ్రాంట్ ఇన్ఎయిడ్, అవుట్సోర్సింగ్ పేరిట చాలీచాలని వేతనాలు ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొందరు అర్చకులు రోజు గడవక దుర్భర జీవితాలు గడుపుతున్నారని, అదే సమయంలో అర్చక వెల్ఫేర్ ట్రస్ట్‌లో రూ.236 కోట్ల నిధులపై వచ్చే వడ్డీ కూడా ప్రభుత్వ ఖజానాకే జమ చేయడమేంటని మండిపడ్డారు.
రాష్ట్రంలోని 686 దేవాలయాల నుంచి కోట్లాది రూపాయల కాంట్రిబ్యూషన్ ఉన్నా అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మరోవైపు.. వెరసీ నెలల తరబడి వేతనాలు అందక అర్చక కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులతో పాటు, నిలిచిపోయిన ఆలయాల కేటగిరీ, అందుకు తగిన కేడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించడంలో చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో అర్చక వెల్ఫేర్ ట్రస్ట్‌బోర్డు మెంబర్ శ్రావణకుమారాచార్యులు, ఉద్యోగసంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, భాస్కరభట్ట రామశర్మ, పరాశరం రవీంద్రాచారి, రాజేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.