– బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య
నకిరేకల్, మే 13 : డిగ్రీతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకున్నపుడే గ్రామీణ యువత ఉపాధి కల్పనలో ముందంజలో ఉంటారని బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్‌లో నిర్వహించిన ‘గ్రామోత్సవం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ‘గ్రామాల అభివృద్ధిలో ఉన్నత విద్యావంతుల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. గ్రామాలకు ఉన్నత విద్య విస్తరించాలని, ఉన్నత విద్యావంతులున్న గ్రామాలకు సమాజంలో మంచి గుర్తింపు, పలుకుబడి ఉంటాయన్నారు. కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ బెల్లి యాదయ్య అధ్యక్షత వహించగా, ఎకనామిక్స్ సహాచార్యులు కె.హరిత అనుసంధాన కర్తగా వ్యవహరించారు.
విద్యావారోత్సవాల కన్వీనర్ వైస్ ప్రిన్సిపాల్ నాగు, పరిసర గ్రామాల పెద్దలు గ్రామ కార్యదర్శులు, శ్రీసరస్వతీ విద్యాసంస్థల అధినేత మారపాక నర్సయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయిని ఉత్తరమ్మ, అధ్యాపకులు ప్రవీణ్ రెడ్డి, డా.శ్రీనివాసాచారి, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, డా.శంకర్, శివశంకర్, ఉపేందర్, శివశంకర్, ఉపేందర్, రవీందర్, సుభాషిణి, కార్యాలయ సిబ్బంది వెంకన్న, కార్తీక్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ తెలుగు చదువుతున్న కళాశాల పూర్వ విద్యార్థిని పి.మౌనికను ప్రధానాచార్యులు సన్మానించారు.

‘డిగ్రీతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకున్నప్పుడే ఉపాధి’