బేగంపేట, మార్చి 10: లంచం తీసుకొంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. హైదరాబాద్‌లోని అల్వాల్ వెంకటాపురానికి చెందిన న్యాయవాది తాటికొండ రాజు ఫామ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం బేగంపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కే మధుసూదన్‌రెడ్డిని సంప్రదించారు. ఆ ప్రక్రియ పూర్తి కావాలంటే రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. న్యాయవాది తాటికొండ రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం సాయంత్రం మధుసూదన్‌రెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. నిందితుడిని శుక్రవారం ఏసీబీ కోర్టులోని మొదటి అదనపు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరుస్తామని తెలిపారు.