హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న దుబాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమార్ ప్రాపర్టీస్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రాష్ర్టానికి ఆహ్వానించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ముచ్చర్లలో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం కావాల్సిందిగా సదరు కంపెనీని ప్రభుత్వం కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముచ్చర్లలో 2 వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేసేందుకు ఎమార్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే రాష్ర్టానికి వచ్చేందుకు ఎమార్ ప్రాపర్టీస్ సంస్థ ఒక షరతు విధించినట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో తమ సంస్థ హైదరాబాద్లో చేపట్టిన ‘బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు’పై నమోదైన కేసులను పరిష్కరించాలని కోరినట్టు సమాచారం.
బౌల్డర్ హిల్స్ కుంభకోణం ఇదీ
హైదరాబాద్, గచ్చిబౌలిలో బౌల్డర్ హిల్స్ పేరుతో నివాస సముదాయాలు, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు సంబంధించి ఎమార్-ఎంజేఫ్ కంపెనీ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు కాగా దర్యాప్తును కోర్టు సీబీఐకి అప్పగించింది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు సీఎంగా ఉండగా 2003లో గచ్చిబౌలిలో 535 ఎకరాల్లో బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం, ఎమార్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందంలో అనేక లొసుగులున్నట్టు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును కొనసాగించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ఇతర వెసులుబాట్లకు తోడు మరిన్ని ప్రోత్సాహకాలను కట్టబెట్టింది. బాబు ప్రభుత్వం ఎమార్ సంస్థకు తక్కువ ధరకే భూమిని కేటాయించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 26 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. తద్వారా ప్రభుత్వానికి అప్పట్లోనే రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక భూసేకరణలో కూడా అనేక అవకతవకలు జరిగినట్టు పలు సంస్థలో దర్యాప్తులో తేలింది. ఆ ప్రాజెక్టులో కొందరు కాంగ్రెస్ పెద్దలు బినామీల పేరుతో అక్రమంగా విల్లాలు దక్కించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
అలాంటి కంపెనీపై అంత ఆసక్తి ఎందుకో?
అవినీతి ఆరోపణలున్న ఎమార్ కంపెనీని మళ్లీ తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేల కోట్లు దోచుకుందనే ఆరోపణలున్న కంపెనీని ఏ విధంగా తీసుకొస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కంపెనీపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు మళ్లీ ఆ కంపెనీని అదే ప్రభుత్వం వెనకేసుకురావడంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి స్కాంగ్రెస్ను చూడబోతున్నామా అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనక ఎవరున్నారు, ఎవరికి అంత ఆసక్తి ఉందో వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.