నగరంలో ఈవీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా.. నాలుగేండ్లలో వాటి సంఖ్య 4,535కు పెరిగాయి. టీఎస్ఆర్టీసీ సైతం 40 ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తున్నది. అంతేకాక ద్వి, త్రి, ఫోర్‌వీలర్ వాహన యజమానులు వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక నగరంలో బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు 4,535, హైబ్రిడ్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు 4,387, హైబ్రిడ్ పెట్రోల్ ఎలక్ట్రిక్ వాహనాలు 1778 ఉన్నాయి. మరోవైపు 2020-2030 వరకు పూర్తిగా ఈవీ మయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం మొదటి రెండు లక్షల ద్విచక్ర వాహనాలకు వందశాతం రోడ్డు ట్యాక్సీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈవీల్లో ద్విచక్ర వాహనాలే అధికంగా వినియోగంలో ఉండటం విశేషం.
పిలిస్తే పలికే కారు..
ఈవీ ఎక్స్‌పోలో ప్రతిఒక్కరూ జెడ్ఎస్ కారుపై ఆసక్తి చూపుతున్నారు. పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా నడిచే ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎకో, స్పోర్ట్స్, నార్మల్ మోడ్‌లో అందుబాటులో ఉండగా.. ఇందులో ఈవీ ఎక్స్‌క్లూజివ్ వాహనం ఖరీదు రూ.26 లక్షలు. బ్యాటరీ కాల పరిమితి 8 ఏండ్లు కాగా వాహనం వారంటీ 5 ఏండ్లు. దీన్ని ఏసీ, డీసీతో పాటు ఇంట్లో ఉండే త్రి పిన్ ప్లగ్‌తో చార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కావాలంటే సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. 320 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఇప్పటికీ 500 వాహనాలను విక్రయించారు. మరో 300 అర్డర్స్ ఉన్నాయి. వాయిస్ రికగైజేషన్ ఈ కారు ప్రత్యేకత. ఇంటర్నెట్ కనెక్ట్ ఉంది. ఈ వాహనాన్ని ఎక్కువగా రాజకీయ, సినీ, వీఐపీలు కొనుగోలు చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.
ఒకేసారి నాలుగు కార్లకు..
పెరుగుతున్న ఈవీలకు అనుగుణంగా నగరానికి చెందిన సాయికృష్ణ, రాజేశ్ జౌల్ పాయింట్ స్టార్టప్ పేరుతో గతేడాది నవంబర్‌లో చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించారు. నాలుగు కార్లు ఒకేసారి చార్జ్ అయ్యేలా యంత్రాలను రూపొందించారు. అపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసుకునేలా రూపొందించిన ఈ యంత్రం ఖరీదు రూ.4.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. గంటలో ఫుల్ చార్జింగ్ అవుతుంది. అంతేకాక జౌల్ పాయింట్ యాప్ ద్వారా వాహనం ఎంత చార్జింగ్ అయ్యింది? దగ్గరలో ఉన్న చార్జింగ్ స్టేషన్ల వివరాలను చూపిస్తుంది. ఈ స్టార్టప్‌తో 30 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు జౌల్ పాయింట్ స్టార్టప్ ఫౌండర్స్.
నిరుద్యోగుల ఆశా జ్యోతి ఈరైడ్..!
సామాన్యులు, వర్తకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరైడ్ కంపెనీ త్రీవీలర్ ఆటోలను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.8 నుంచి రూ.10 లక్షలు. ఎలాంటి మొయింటెనెన్స్ లేదు. ఈ వాహనాల కొనుగోలుపై బ్యాంక్‌ల నుంచి రుణం పొందవచ్చు. టెలిమిస్టిక్ సాఫ్ట్‌వేర్‌తో నడిచే వాహనంలో అనేక ఫీచర్లు ఉన్నాయి. సీసీటీఈ, జీపీఎస్‌తో అనుసంధానమై ఉంది. ఇది అమిగో మోడల్ వెహికిల్. దీని ధర రూ.2.70లక్షలు.
ఇది సౌండ్ లేని డుగ్గుడుగ్గు..
ఇది అచ్చు బులెట్ బండిని పోలి ఉంటుంది.
దీని పేరు ఎలక్ట్రిక్ క్రిడాన్. దీని ధర రూ.1.50 లక్షలు. వేగం 95 కిలోమీటర్లు. మూడు గంటలు చార్జింగ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. 120 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
నడపొచ్చు.. తొక్కొచ్చు
ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ బుల్లి సైకిలైన ఐస్ అందరిని ఆకర్షిస్తున్నది. ఈ సైకిల్‌ను ఇష్టమున్నట్లు ఫోల్డ్ చేసుకోవచ్చు. మూడు గంటల పాటు చార్జ్ చేస్తే సుమారు 25 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఓ వేళ చార్జ్ అయిపోతే తొక్కొచ్చు. దీని ధర రూ.28 వేలు అమ్మకాలు పెరిగేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు
గ్రేటర్లో ఈవీల అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఈవీ పాలసీ తేవడంతో అనేక కంపెనీలు ఈవీలను తయారు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈరైడ్ ద్వారా త్రీ వీలర్ ట్రాలీ వెహికల్స్‌ను తీసుకొచ్చాం. ముఖ్యంగా వ్యాపారుల కోసం ఈ వాహనాన్ని డిజైన్ చేశాం. చాలా మంచి ఆదరణ ఉంది. ఈవీల వినియోగం పెంచేందుకు సర్కార్ చేస్తున్న కృషి అభినందనీయం.
విరివిగా చార్జింగ్ స్టేషన్లు..
నగరంలో చార్జింగ్ స్టేషన్ల సమస్య లేకుండా చేస్తున్నాం. ఇప్పటికే నగరంలో అనేక చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవారికి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లను డిజైన్ చేశాం. స్థలం ఉన్న వాళ్లు చార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇలాంటి ఎగ్జిబిషన్లతో నగరవాసులకు అవగాహన పెరగడం ఖాయం.
-రాజేశ్, జౌలే పాయింట్ చార్జింగ్ స్టేషన్ ఫౌండర్