హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): అసలే చాలీచాలని వేతనం. అదీ కూడా ప్రతినెలా చేతికి అందుతుందా? అంటే అదీలేదు. నెలల తరబడి నిరీక్షిస్తేగానీ ఖాతాలో జమ కానీ పరిస్థితి. ఇది రాష్ట్రంలోని సగటు ఒప్పంద ఉద్యోగి దుస్థితి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,900 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం ఆరేడు నెలల నుంచి అరిగోసపడుతున్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యం వల్ల రోజువారీ ఖర్చులకు డబ్బుల్లేక ఇక్కట్లపాలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మాడల్ స్కూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు 1,900 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థాయిని బట్టి వారికి రూ.13,600 నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. మైండ్ లీడర్స్, యువశక్తి, లక్ష్య్, లేబర్‌నెట్, ఎల్అండ్జే, వాల్యూయర్ తదితర 18 ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. వీటిలో ఒకటి రెండు మినహా మిగిలిన ఏజెన్సీలు 6-7 నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్తున్నారు. ఆ ఏజెన్సీల నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు పరస్పరం నెపం వేసుకుంటూ తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
అప్పులతో అరిగోస
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నిరుడు జూన్, జూలై నెలల వేతనాలను ఆగస్టులో చెల్లించారు. ఆ తర్వాత నుంచి తమకు వేతనాలు అందడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు ఏజెన్సీలు మాత్రం 2 నెలల కిందట వేతనాలు చెల్లించాయని, మిగిలిన ఏజెన్సీల పరిధిలోని ఉద్యోగులకు మాత్రం జీతాలు అందలేదని చెప్తున్నారు. గతంలో కనీసం రెండు మూడు నెలలకైనా జీతాలు అందేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, సకాలంలో జీతాలు అందక రోజువారీ ఖర్చులకు సైతం నానా అవస్థలు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇండ్ల కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక అప్పులతో అరిగోసపడుతన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినతులు బుట్టదాఖలు
అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా 1నే వేతనాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు.. తీరా అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా ఆ హామీ అమలుకు చర్యలు చేపట్టడం లేదని, దీంతో తమ పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, అధికారులకు సమర్పించిన వినతులు బుట్టదాఖలవుతున్నాయని మండిపడుతున్నారు. బడా కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. చిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి సక్రమంగా తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటు మాటలకే పరిమితం
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. ఆ వేతనాల్లో ఏజెన్సీల నిర్వాహకులు 10 నుంచి 20% వరకు కట్ చేసుకుంటున్నట్టు చాలా కాలం నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఆ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయకపోయినా ప్రతినెలా తమ వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.