హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులు, కార్మికులకు ఆరోగ్య భద్రత కరువైంది. తాజాగా దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వారికి ప్రాణసంకటంగా మారింది. దీంతో ఆ అభాగ్యులంతా కార్పొరేట్ వైద్యానికి దూరమై అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ పాలసీ కింద ఎస్పీడీసీఎల్ గతంలో తమ ఉద్యోగులకు కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటయ్యేలా క్రెడిట్‌కార్డులు ఇచ్చింది. సంబంధిత డిపార్ట్మెంట్ ఎన్వోసీ ఇస్తేనే ఈ క్రెడిట్‌కార్డులు పనిచేస్తాయి. దీంతో అనారోగ్యంతో ఆ దవాఖానల్లో చేరిన ఆర్టిజన్లు, రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగులు తమ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షల వరకు వినియోగించుకునేలా ఎన్వోసీ ఇచ్చేవారు. అనారోగ్య సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగులకు మరో రూ.5 లక్షల వరకు పెంచేవారు. ఒకవేళ విధుల్లో ఉండగానే ప్రమాదం జరిగి దవాఖాన పాలైనవారికి ఈ పరిమితిని మరో రూ.10 లక్షల వరకు పెంచేవారు. దీంతో ఆ ఉద్యోగులు దాదాపు 300 కార్పొరేట్ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు అవకాశం ఉండేది.
యాజమాన్య నిర్ణయమే శాపం
ఈ స్కీమ్ కింద తమ ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా రూ.1,000 చొప్పున వసూలు చేసిన ఎస్పీడీసీఎల్ యాజమాన్యం.. ఇటీవల నిబంధనలు మార్చింది. క్రెడిట్‌కార్డు ద్వారా ఉద్యోగులకు వైద్యసేవలు అందించే దవాఖానల యాజమాన్యాలు టీజీఎస్పీడీసీఎల్కు రూ.10 లక్షల డిపాజిట్ లేదా బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని కొత్త నిబంధన విధించింది. దీన్ని పలు కార్పొరేట్ దవాఖానలు వ్యతిరేకించడంతో వాటిని తమ జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆ జాబితాలోని దవాఖానల సంఖ్యను 42కే పరిమితం చేసింది. వాటిలోనే క్రెడిట్‌కార్డులు ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ చిన్న దవాఖానలనే ఆశ్రయించాల్సి వస్తున్నదని, కార్పొరేట్ వైద్యసేవలు పొందే అవకాశాన్ని కోల్పోయామని వాపోతున్నారు.
సగం చికిత్స పొందినవారు ఎక్కడికి పోవాలి?
అనుక్షణం ప్రమాదపుటంచుల్లో పనిచేసే తమ ప్రాణాలతో ఎస్పీడీసీఎల్ చెలగాటమాడుతున్నదని విద్యుత్తు ఉద్యోగులు మండిపడుతున్నారు. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటికే కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న దీర్ఘకాలిక రోగుల పరిస్థితి ఏమిటని, సగం చికిత్స పొందిన తర్వాత వారు వేరే చిన్న దవాఖానలకు వెళ్తే ఆరోగ్యం కుదుటపడుతుందా? అని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ స్కీమ్ కింద తమ వేతనాల నుంచి ప్రతి నెలా రూ.1,000 చొప్పున వసూలు చేస్తూనే కొత్త నిబంధన ఎందుకు తీసుకొచ్చారని నిలదీస్తున్నారు. క్రెడిట్‌కార్డు ద్వారా వైద్యసేవలు అందించాలంటే రూ.10 లక్షలు డిపాజిట్ సమర్పించాలన్న నిబంధనను వెంటనే ఎత్తివేయాలని, మునుపటిలా తమకు కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.