హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యుత్తు సంస్థలకు ఎల్‌నినో సవాలు విసురుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల, లోటు వర్షపాతంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మోత మోగుతున్నది. రాష్ట్రంలో ఈ నెల 5న 212 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్తు వినియోగం ఈ నెల 14 నాటికి 306 మిలియన్ యూనిట్లు దాటింది. దీంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే విద్యుత్తు వినియోగం ఏకంగా 94 మిలియన్ యూనిట్లు పెరిగింది. పీక్ డిమాండ్ 11,395 నుంచి 16,270 మెగావాట్లకు చేరింది. ప్రతిరోజూ వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్తు సంస్థల అధికారుల్లో కలవరం మొదలయ్యింది. ప్రస్తుత వానకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన దాఖలాల్లేవు. వేడిగాలులు, ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు మరింత ఆలస్యమైతే రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడతారు. దీంతో బోర్లు, బావుల్లోని మోటర్లను ఎక్కువ సేపు నడపాల్సి ఉంటుంది. తద్వారా వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరిగి మొత్తం రాష్ట్ర విద్యుత్తు అవసరాలపై అదనపు భారం పడే అవకాశం ఉన్నది.
డిమాండ్, వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్తు సంస్థల అంచనాలు తప్పాయి. సాధారణంగా ఏటా మార్చిలో పీక్ డిమాండ్, అత్యధిక విద్యుత్తు వినియోగం నమోదవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సారి జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు పకడకపోతే వినియోగం, పీక్ డిమాండ్ పెరిగి విద్యుత్తు వ్యవస్థ అతులాకుతలమవుతాయి. పీక్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే అవసరాలకు తగ్గట్టు డిస్కమ్‌లు విద్యుత్తు కొనుగోళ్లను పెంచుకోవాల్సి ఉంటుంది.
