‘గుడ్ మార్నింగ్ డియర్!’ అన్న శ్రీమతి పిలుపు, మనకు మేలుకొలుపు. ‘గుడ్ మార్నింగ్ తల్లీ!’ అని మన చిట్టితల్లిని ఎంత ముద్దుగా నిద్ర లేపుతామో కదా! అలాగే ఎవరిని కలిసినా ముందుగా.. ‘గుడ్ మార్నింగ్!’ అనో, ‘గుడ్ ఈవినింగ్!’ అనో పలకరిస్తూ ‘గుడ్’ని ఎన్నోసార్లు గుర్తుచేసుకొంటూ ఉంటాం. అంటే మనలో ఉన్న ఆశావహ దృక్పథాన్ని ‘మంచి’ అనే మందుతో పెంచుకొంటున్నామన్నమాట! సిల్లీగా ఉండొచ్చు కానీ.. ‘గుడ్’ని అన్నిసార్లు గుర్తుచేసుకొనే మనం.. పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుడ్డును మాత్రం ఆహారంలో భాగం చేసుకోలేకపోతున్నాం. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఆ పోషకాల గని గురించి..
అమ్మపాలలోని అమృతత్వమూ..
తల్లి గర్భం నుంచి శిశువు జన్మించగానే ఆత్రంగా తాగేది అమ్మపాలనే. శిశువు ఎదగడానికి ఉపయోగపడే అన్ని రకాల పోషకాలు, వివిధ వ్యాధులతో పోరాడే వ్యాధి నిరోధక శక్తి అమ్మపాల నుంచే లభిస్తాయి. ఆహార విలువలను కొలిచే ‘బయోలాజికల్ వాల్యూ (బి.వి)’లో కూడా అమ్మపాలే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మనం తీసుకొనే ఆహారాల్లో ‘బయోలాజికల్ వాల్యూ’లో రెండవ స్థానంలో గుడ్డు నిలబడుతుంది. అయితే.. శిశువు ఎదుగుదలకు అమ్మపాలు ఒకటి రెండేండ్లకు మించి దోహదపడవు. తల్లిపాల తర్వాత పిల్లలకు జీవితాంతం అత్యుత్తమ పోషకాలను అందించేది గుడ్డు మాత్రమే. ఈ సృష్టిలో కల్తీ చేయలేని ఆహారం తల్లిపాలే. తల్లిపాల తర్వాత కల్తీ చేయలేని ఆహారం గుడ్డు మాత్రమే. తమ పిల్లలను ప్రేమించే తల్లులందరూ తప్పనిసరిగా గుర్తుంచుకొని చేయాల్సిన పని.. ప్రతిరోజూ పిల్లలకు గుడ్డు తినిపించడమే! అమ్మే కదా పిల్లల బాగోగులు చూసుకోవాల్సింది!
చిటికెలో వంట.. గుటకలో పోషకాల పంట!
మీరు బ్యాచిలరా? మీ జీవితం బిజీబిజీగా సాగిపోతున్నదా!? వంట చేసుకొనే టైం కూడా లేదా!?.. నో టెన్షన్. మీరిక నిశ్చింతగా ఉండొచ్చు. ఈ భూమి మీద వేగంగా చేయగల వంట ఏదో తెలుసా.. గుడ్డండీ బాబూ! అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, బ్యాచిలరైనా, మ్యారీడైనా.. గుడ్లు ఇంట్లో ఉంటే.. చిటికెలో వంట చేసెయ్యొచ్చు. వందల రకాల వంటకాలు చేయడం కూడా గుడ్డుతోనే సాధ్యం. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నా.. గుడ్డుతో బ్రహ్మాండమైన రుచి వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీకు కావల్సినవన్నీ గుడ్డులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం.. గుడ్డు పట్టండి. గంటె తిప్పండి.. వేడి వేడి వంటకాలు చిటికెలో సిద్ధం చేయండి!
ఒక అధ్యయనం ప్రకారం.. మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి తీసుకోవాల్సిన గుడ్లు 181. కానీ, మనం సంవత్సరానికి 91 గుడ్లు మాత్రమే తీసుకుంటున్నాం. మానవ శరీరం ఎన్నో కండర, కణజాల సముదాయమని మనకందరికీ తెలిసిందే. కండరాలు పుష్టిగా ఎదగాలన్నా, అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలన్నా శరీరానికి ఎన్నో మినరల్స్, విటమిన్స్‌తోపాటు ప్రొటీన్స్ కావాల్సి ఉంటుంది. వాటికోసం మనం తగిన మొత్తంలో శాకాహారం, మాంసాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండిటిలో ఉన్న పోషకాలన్నీ.. ఒకే ఒక్క ఆహారం ద్వారా మనకు లభిస్తున్నాయి. ఆ సంపూర్ణ సమతులాహారమే గుడ్డు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ రెండో శుక్రవారం ‘ప్రపంచ గుడ్డు దినోత్సవం’ జరుపుకొంటారు. ఈ సందర్భంగా గుడ్డు చుట్టూ ముడిపడిన అపోహలను తొలగించు కుందాం. గుడ్డును మన ఆహారంలో భాగం చేసుకుందాం.
గుడ్డులో ఏముంది?
మనం పీల్చుకొనే ఆక్సిజన్‌లో సగభాగం మెదడుకు.. మిగతా సగంలో సగం ఆక్సిజన్ గుండెకు, మిగతాది రక్తసరఫరా సరిగ్గా జరగడానికి అవసరం అవుతుంది. ఆక్సిజన్ అవయవాలన్నిటికీ సరిగ్గా అందాలంటే.. మనకు ‘ఐరన్’ ఎంతో అవసరం. ఆ ‘ఐరన్’ గుడ్డులో మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక గర్భిణులకు అవసరమైన ‘ఫోలిక్ యాసిడ్’ కూడా గుడ్డుతోనే ఎక్కువ మోతాదులో అందుతుంది. ఇవేకాదు.. ఎదుగుతున్న పిల్లలకు కావాల్సిన కండర పుష్టిని అందించే ‘ప్రొటీన్’.. దీంట్లో పుష్కలంగా ఉంది. థైరాయిడ్ పనితీరు సక్రమంగా ఉండటానికి అవసరమైన ‘అయోడిన్’, శరీరంలో తేమను పట్టి ఉంచే ‘విటమిన్-ఇ’, కంటిచూపును మెరుగు పరచే ‘విటమిన్-ఎ’, రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి అవసరమయ్యే ఎర్ర రక్తకణాలు తయారు కావడానికి కావలసిన ‘విటమిన్- బి12’, శరీర జీవక్రియల వేగం (మెటబాలిజం రేట్) పెరగడానికి అవసరమైన ‘విటమిన్-బి5’ మొదలైన ఎన్నో విటమిన్స్, మినరల్స్ సమ్మేళనమే.. గుడ్డు. సూటిగా చెప్పాలంటే.. ఒక్క ‘విటమిన్-సి’ తప్ప మిగిలిన అన్ని విటమిన్స్, ప్రొటీన్స్ గుడ్డులో ఉన్నాయి.
ఉత్పత్తిలో మూడోస్థానం. మరి వినియోగంలో..?
ఇదో ఆశ్చర్యకరమైన విషయం. గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంతో పోటీపడుతూ 3వ స్థానంలో కొనసాగుతున్న మనం.. వినియోగంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. ఎంతో చవకగా లభించే పౌష్టికాహారమైన గుడ్లను ఎగుమతి చేసి, ఎందుకూ పనికిరాని ఎనర్జీ డ్రింకులను, హెల్త్ డ్రింకులను దిగుమతి చేసుకుంటున్నాం. అవగాహనా లోపమే దీనికి ప్రధాన కారణం. గుడ్డు గురించి, గుడ్డు అందించే పోషకాల గురించి మరింతగా తెలుసుకొని, గుడ్డు వినియోగాన్ని పెంచుదాం. ఆరోగ్యంగా.. ఆనందంగా జీవిద్దాం.
పోషకాలు ఫుల్
విటమిన్ డి.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు ఎన్నో సమస్యలను అదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్యాల్షియం లాంటి పోషకాలు కణాలకు చేరేందుకు దోహదపడుతుంది. కానీ, విటమిన్-డి సహజంగా లభించే సూర్యకాంతికి మనం దూరంగా ఉండటంతో, దాన్ని ఇప్పుడు ఆహారం రూపంలోనే తీసుకోవాల్సి వస్తున్నది. అయితే కాయగూరలలో ఈ విటమిన్ తక్కువగా ఉండటం వల్ల శాకాహారులకు విటమిన్-డి లభించడం పెద్ద సమస్యగా మారింది. దానికి పరిష్కారమే.. గుడ్డు. మన రోజువారీ విటమిన్-డి అవసరంలో ఐదో వంతు ఒక్క గుడ్డులోనే లభిస్తున్నదని ఆహార
నిపుణులు చెబుతున్నారు. బి12.. ఓ ముఖ్యమైన విటమిన్. రక్తహీనత నుంచి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వరకూ బి12 లోపంతో ఏర్పడే సమస్యలు సవాలక్ష. జుట్టు నుంచి కండరాల వరకు.. ఈ విటమిన్ ఒంట్లోని అణువణువుకూ సాయపడుతుంది. శాకాహారులకు ఈ బి12 అందే అవకాశం చాలా తక్కువ. అందుకే ఇప్పుడు నూనె లాంటి ఆహార ఉత్పత్తులకు కృత్రిమంగా బి12 చేర్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ కష్టమంతా లేకుండా ఒక్క గుడ్డులో మన రోజువారీ అవసరానికి సరిపడే బి12 లభిస్తుందని ఓ అంచనా!
జీరో సైజు అయినా.. హీరో సైజు అయినా
పైన ఇచ్చిన స్టేట్మెంట్.. వింతగా అనిపిస్తున్నదా! ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ప్రపంచంలోని డైటీషియన్లు, ఫిట్నెస్ ట్రైనర్లు అందరూ ముక్తకంఠంతో చెబుతున్న వాస్తవం ఇది. డైటింగ్ చేసేవారు ప్రతిరోజూ ఉదయం ఉడికించిన గుడ్డు తింటే.. తక్కువ కేలరీలతో (ఉడికించిన గుడ్డు నుంచి 77 కేలరీలు లభిస్తాయి) ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోగలరు. దీంతో చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా ఆ తర్వాత తీసుకొనే ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటాం. దానివల్ల శరీరభారం తగ్గిపోయి స్లిమ్‌గా, చూడముచ్చటగా తయారవుతారు.కండలు పెంచాలనుకొనే వారు కచ్చితంగా తినాల్సిన ఆహారం గుడ్లే. రోజువారీ ఆహారానికి తోడుగా ప్రొటీన్లు అధికంగా ఉన్న గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అధిక పోషకాలు అందుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. కొంచెం జిమ్ చేస్తే.. సౌష్టవంతో కూడిన బాడీని పెంచడం సులభం. ఈ మధ్య ఒక సినిమా కోసం మన యువహీరోలు కండలు పెంచారు. వాళ్లు ఆహారంలో అధికంగా తీసుకున్నది గుడ్లే! చూశారా.. గుడ్డుతో డబుల్ బెనిఫిట్స్. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం.. ఒత్తయిన కేశాలతోనే అందానికి పరిపూర్ణత వస్తుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి అవసరమైన ‘కెరోటిన్’ అనే ప్రొటీన్ పదార్థం గుడ్డులో చాలా ఎక్కువ.
సంపూర్ణమైన సమతులాహారం ఇప్పుడు మనందరికీ విరివిగా, అందుబాటు ధరలో దొరుకుతున్నదంటే.. దాని వెనుక ఒక వ్యక్తి అకుంఠిత దీక్ష, సమాజం పట్ల బాధ్యత, సామాన్యులు కూడా పారిశ్రామిక రంగంలోకి రావాలన్న ఆకాంక్ష ఉన్నాయి. ఆ మహానుభావుని పేరు.. బి.వి రావు. 60, 70వ దశకాలలో పెరటికే పరిమితమైన కోళ్ల పెంపకంతో గుడ్ల ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. దాంతో అధిక సంతానం కలిగిన కుటుంబాలకు పోషకాహారం అందడం కలలో మాట. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణం కూడా తక్కువగా ఉండేది. 70వ దశకంలో అప్పుడప్పుడే మొదలవుతున్న కోళ్ల పరిశ్రమలో కూడా పలురకాల వ్యాధులతో కోళ్లు పోరాడాల్సి రావడంతో రైతులు ఎక్కువగా నష్టాలు ఎదుర్కొనేవారు. రైతులు, ప్రజలు ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఉండటం గమనించిన బి.వి రావు, మన దేశ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే కోళ్ల బ్రీడ్‌ను అభివృద్ధి చేసి.. భారతీయ కోళ్ల పరిశ్రమలో పెనుమార్పులు తెచ్చారు. అక్కడితో ఆగకుండా సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా దేశమంతటా తిరుగుతూ పౌష్టికాహార ఆవశ్యకతను పల్లె పల్లెనా తెలుపుతూ.. ప్రజలలో గుడ్ల ఉపయోగం గురించి, వినియోగం గురించి చైతన్యం తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. దానితోనే ఆయన పోరాటం ఆగలేదు. కోళ్ల పరిశ్రమలో అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న దళారి వ్యవస్థను అడ్డుకొని, రైతులతోనే రైతుల కోసం
‘నా గుడ్డు.. నా ధర’ నినాదం స్ఫూర్తిగా కోళ్ల రైతుల కమిటీని ఏర్పరిచారు. దాంతో గుడ్లు మనందరికీ ఎంతో సరసమైన ధరలకు ప్రతి దుకాణంలోనూ దొరకడం మొదలైంది. అందుకేనేమో.. ప్రతి కోళ్ల రైతూ బి.వి. రావు ఫొటో ఫారాలలో పెట్టుకొని పూజిస్తుంటే.. ప్రజలు భారత పౌల్రీ ్ట పితామహుడంటూ కీర్తిస్తున్నారు. బి.వి. రావు ఇంతటి కృషి వెనుక కనిపించని మహోన్నత మహిళ కూడా ఉన్నారు. ఆమె బి.వి. రావు సహధర్మచారిణి ఉత్తరాదేవి. ఆయన ప్రతి అడుగులోనూ వెన్నంటి ధైర్యాన్నిస్తూ జాతికి ఒక మేలు జరగడంలో ఆమె కీలక పాత్ర వహించారు.
వి.హెచ్ గ్రూప్..
మనం ఏ విత్తు నాటితే.. అదే మొక్క వస్తుందని నానుడి. అది బి.వి. రావు సంతానం విషయంలో అక్షరాలా నిజం. వి.హెచ్ గ్రూప్ చైర్మన్ అనురాధా దేశాయ్, వారి సోదరులు వెంకటేశ్వరరావు, బాలాజీరావు తల్లిదండ్రుల నుంచి అందుకొన్న జీవిత విలువలు, సమాజం పట్ల బాధ్యత మరువకుండా, నిరంతరం పౌల్ట్రీ రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ, పౌల్ట్రీ రైతులకు ఉపయోగపడేలా ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి, తండ్రికి తగ్గ బిడ్డలుగా వారి కీర్తిని నిలబెడుతున్నారు.